మూణ్నెళ్లలో ముగించాలి

GHMC Commissioner Dana Kishore Review on LB Nagar Underpass - Sakshi

ఎల్‌బీనగర్‌‘అండర్‌పాస్‌’పై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌  

త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం  

పనుల పురోగతిపై పరిశీలన  

సాక్షి, సిటీబ్యూరో: ఎల్‌బీనగర్‌–బైరామల్‌గూడ మార్గంలో నిర్మిస్తున్న అండర్‌పాస్‌ పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ ప్రాజెక్టు విభాగం ఇంజినీర్లను ఆదేశించారు. అండర్‌పాస్‌ పనులను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జోనల్‌ కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాసరెడ్డితో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అండర్‌పాస్‌ నిర్మాణంతో ఎల్‌బీనగర్‌ జంక్షన్‌లో దాదాపు 90శాతం ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎల్‌బీనగర్‌ జంక్షన్‌లో రూ.44.74 కోట్లతో ఎస్సార్డీపీ పనులు జరుగుతున్నాయని తెలిపారు. 520 మీటర్ల పొడవుండే ఈ అండర్‌పాస్‌లో ఎల్‌బీనగర్‌  ఎడమ వైపు నిర్మాణంలో 17 రాఫ్ట్‌లు, 76 రిటైనింగ్‌ లిఫ్ట్‌లు, 111 ప్రీకాస్ట్‌ బాక్స్‌వాల్‌ సెగ్మెంట్‌లు, 49 బాక్స్‌ ప్రీ స్లాబ్‌ ప్లాంక్‌ల నిర్మాణం పూర్తయిందని వివరించారు. పనులు పూర్తయ్యేందుకు నాలుగు నెలలు పడుతుందని ఇంజినీర్లు కమిషనర్‌కు వివరించగా... పనుల్లో  వేగం పెంచి మూడు నెలల్లోనే పూర్తి చేయా లని సూచించారు. ఎస్సార్డీపీ పనులకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. జనరల్‌ ఫండ్‌ నుంచి ఇటీవల రూ.42 కోట్లు ఎస్సార్డీపీ బిల్లులకు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత ఎస్సార్డీపీ పనులకు ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకుంటామని చెప్పారు. 

‘డబుల్‌’ కాలనీల్లో బస్తీ దవాఖానాలు..  
నగరంలో నిర్మిస్తున్న లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కాలనీల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసే యోచన ఉందని కమిషనర్‌  తెలిపారు. వనస్థలిపురంలో రూ.28కోట్ల వ్యయంతో చేపట్టిన 324 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం దాదాపు 70శాతం పూర్తయిందని జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి కమిషనర్‌కు వివరించారు. డ్రైనేజీ, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో చేపట్టిన నాలాల పూడికతీత తొలిదశ పనులన్నింటినీ మే చివరి వరకు పూర్తి చేయాలన్నారు. లేని పక్షంలో ఇంజినీర్లపై చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హెచ్చరించారు. ఎల్‌బీనగర్‌ జోనల్‌ కార్యాలయంలో ఇంజినీరింగ్‌ పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కమిషనర్‌ మాట్లాడుతూ... నాలాల్లో పూడిక తీస్తున్న ప్రాంతాల్లో ఆయా పనుల సమాచారాన్ని తెలిపే బోర్డులు ప్రదర్శించాలని సూచించారు. బోర్డులపై పనుల విలువ, పూర్తయ్యే తేదీ, ఇన్‌చార్జి అధికారి పేరు తదితర వివరాలు ఉండాలన్నారు. టెండర్లు దక్కించుకున్నప్పటికీ ఇప్పటి వరకు పీపీఎం రోడ్ల పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను రద్దు చేసి, మళ్లీ టెండర్లు పిలిచే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఇతర జోన్లతో పోలిస్తే ఎల్‌బీనగర్‌లో ఇంజినీరింగ్‌ పనులు పురోగతిలో ఉండడంపై అధికారులను అభినందించారు. ఈ సమావేశంలో జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి, ఇన్‌చార్జి చీఫ్‌ ఇంజినీర్‌ అశ్విన్‌కుమార్, ఎస్‌ఈ శంకర్‌లాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top