భవిష్యత్తు డిజైనింగ్‌ రంగానిదే!

Future is Designing sector itself - Sakshi

‘హైదరాబాద్‌ డిజైన్‌ వీక్‌’తో విద్యార్థులకు అపార అవకాశాలు 

లోగో, వెబ్‌సైట్‌ ప్రారంభోత్సవంలో జయేశ్‌ రంజన్‌

సాక్షి, హైదరాబాద్‌: రాబోయే రోజుల్లో డిజైనింగ్‌ రంగానికి ప్రాధాన్యం పెరగనుందని, ప్రతీ రంగంలోనూ డిజైనింగ్‌తో విప్లవాత్మక మార్పులు తీసుకురావొచ్చని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అన్నారు. సృజనాత్మకతకు పదును పెట్టేలా, యువతకు, విద్యార్థులకు అరుదైన, అద్భుత అవకాశాలు కల్పించే చక్కటి వేదికగా ఇది మారాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వరల్డ్‌ డిజైన్‌ అసెంబ్లీ (డబ్ల్యూడీఏ) 31వ వేడుకలు హైదరాబాద్‌లో జరగనుండటం దేశానికే గర్వకారణమన్నారు. హైదరాబాద్‌ డిజైన్‌ వీక్‌ (హెచ్‌డీడబ్ల్యూ)లో భాగం గా అక్టోబరు 9 నుంచి 13 వరకు హ్యుమనైజింగ్‌ డిజైన్‌ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇకనుంచి ఏటా హెచ్‌డీడబ్ల్యూ వేడుకలు నగరంలో జరుగుతాయన్నారు. హైదరాబాద్‌ డిజైన్‌ వీక్‌ ద్వారా విద్యార్థుల కు అపార అవకాశాలు కలుగుతున్నాయన్నారు.  

సృజనాత్మకతను ప్రోత్సహించేలా..  
సృజనాత్మకతను ప్రోత్సహించేలా అక్టోబరు 9, 10వ తేదీల్లో నగరవ్యాప్తంగా పలు ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ కార్యక్రమాలు చేపడతామని జయేశ్‌ రంజన్‌ పేర్కొన్నారు. పతంగులు చేయడం, బొమ్మలు గీయడం, ఫొటోగ్రఫీ, ఆర్కిటెక్ట్, తదితర అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామన్నారు. అనంతరం హెచ్‌డీడబ్ల్యూ లోగోను, వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో జయేశ్‌ రంజన్‌తో పాటు గ్రీన్‌గోల్డ్‌ కంపెనీ సీఈవో రాజీవ్‌ చిల్కా, అహ్మదాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ నహర్, రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌(రిచ్‌) డైరెక్టర్‌ జనరల్‌ అజిత్‌ రంగ్నేకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్‌ చిల్కా మాట్లాడుతూ..మనదేశానికి గుర్తింపు తీసుకొచ్చిన చోటా భీమ్‌ డిజైన్‌ కోసం తన బృందం చేసిన కృషిని వివరించారు. భవిష్యత్తులో వ్యవసాయం, రోడ్డు ప్రమాదాలు, రవాణా, పర్యావరణం, జనాభా, వసతులు తదితర రంగాల్లో డిజైనింగ్‌లతో ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో అజిత్‌ రంగ్నేకర్, ప్రవీణ్‌ నహార్‌ వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top