
ముందుకొచ్చిన మూడు ఐఐటీలు, స్పెయిన్ కంపెనీ
ఈఓఐ గడువు పొడిగించాలని కోరిన సంస్థలు
అర్హతలను సైతం సడలించాలని పలు సంస్థల విజ్ఞప్తి
రేపటితో ముగియనున్న బిడ్డింగ్ గడువు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణకు డిజైన్లతోపాటు సమ గ్ర పునరుద్ధరణ ప్రణాళికను అందించడానికి పలు ఐఐటీలతోపాటు విదేశీ సంస్థలూ ముందుకొచ్చాయి. రూర్కి, మద్రా స్, హైదరాబాద్ ఐఐటీలతోపాటు నిప్పాన్, ఆర్వీ అసోసియే ట్స్, స్పెయిన్‌కు చెందిన మరో సంస్థ ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)లో పాల్గొంటున్నాయి.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ తుది నివేదికలో చేసిన సిఫారసులకు అనుగుణంగా బరాజ్‌ల పునరుద్ధరణకు డిజైన్లు, పునరుద్ధరణ ప్రణాళిక అందించాలని కోరుతూ నీటిపారుదల శాఖ ఈ నెల 1న ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించగా, ఈ నెల 15తో బిడ్ల దాఖలుకు గడువు ముగియనుంది. ఈ క్రమంలో సోమవారం జలసౌధలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ప్రీబిడ్ సమావేశం నిర్వహించగా, పైన పేర్కొన్న సంస్థల ప్రతినిధులు పాల్గొని బిడ్ల దాఖలుకు గడువును 15 రోజులు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ గడువును వారం రోజులు పొడిగించే అంశాన్ని నీటిపారుదల శాఖ పరిశీలిస్తోంది.
నిబంధనలు సడలించాలి...
బరాజ్‌ల పటిష్టతపై మదింపు, హైడ్రాలజీ, హైడ్రాలిక్ రివ్యూ, వరదలు/భూకంపాలు వంటి విపత్తులను ఎదుర్కోవడంలో బరాజ్‌లకు ఉన్న సామర్థ్యంపై మదింపు, గేట్లు/పియర్లు/సిలి్టంగ్ బేసిన్/కటాఫ్ వాల్స్ వంటి కీలక విభాగాలను పటిష్టం చేసేందుకు డిజైన్లు అందించాలని ఈఓఐలో నీటిపారుదల శాఖ కోరింది. బరాజ్‌ల ప్రస్తుత డిజైన్లతో పాటు ఎన్‌డీఎస్‌ఏ నివేదికల్లోని సిఫారసులను పునఃసమీక్షించాలని కోరింది. ఈ క్రమంలో అవసరమైతే క్షేత్ర స్థాయిలో పర్యటించి జియోటెక్నికల్, జియోఫిజికల్ వంటి పరీక్షలు నిర్వహించాలని సూచించింది.
ఈ పరీక్షల ద్వారా బరాజ్‌లలో ఉన్న అన్ని రకాల లోపాలను గుర్తించాలని కోరింది. ఎన్‌డీఎస్‌ఏ సిఫారసుల మేరకు మేడిగడ్డ బరాజ్‌లోని కుంగిన 7వ బ్లాకును సుస్థిరం చేయడం లేదా సురక్షితంగా తొలగించే అంశంపై అధ్యయనం జరిపి తగిన పరిష్కారాలను సూచించాలని తెలిపింది. పక్కనే ఉన్న ఇతర బ్లాక్‌లకు ఎ లాంటి నష్టం కలిగించకుండా 7వ బ్లాక్‌ను తొలగించేలా పరిష్కారాలు ఉండాలని షరతు విధించింది. ఎంపికైన సంస్థ అందించే డిజైన్లు, డ్రాయింగ్స్‌కి కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదం పొందాలి. ఆసక్తి గల సంస్థ గత 15 ఏళ్ల లో కనీసం ఒకటి రెండు ప్రాజెక్టుల పునరుద్ధరణ కోసం ఇ లాంటి పనులు చేసి ఉండాలని అర్హతలను నిర్దేశించింది.
14 మీటర్ల ఎత్తుతో బరాజ్‌ల నిర్మాణంలో అనుభవం కలిగి ఉండాలని మరో అర్హతగా పేర్కొంది. ఈ నిబంధనను సడలించి ఎత్తును 7.5 మీటర్లకు కుదించాలని ప్రీబిడ్ సమావేశంలో కొన్ని సంస్థలు కోరినట్టు తెలిసింది. మరికొన్ని నిబంధనల విషయంలో సైతం సడలింపులు కల్పించాలని ఔత్సాహిక బిడ్డర్లు కోరినట్టు తెలిసింది. ప్రభుత్వంతో చర్చించిన అనంతరం దీనిపై శాఖ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఐఐటీ రూర్కీ వద్దు..
కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణానికి ఐఐటీ రూర్కీ సాంకేతిక సహకారం అందించింది. ఆ బరాజ్‌లలో లోపాలు బయటపడిన నేపథ్యంలో ఐఐటీ రూర్కీ సహకారం మళ్లీ తీసుకోరాదని ప్రభుత్వం భావిస్తోంది.