
ప్రత్యేకమైన కళాకృతులు, ఆభరణాలు, కళలకు సంబంధించి అత్యాధునిక డిజైన్లను అందించే ఆర్ట్ కనెక్ట్, ఎ అండ్ హెచ్ కొలాబ్ సంస్థ సంయుక్తంగా హైదరాబాద్ వేదికగా తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు తెలిపాయి. సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్ సమీపంలో స్పిరిట్ కనెక్ట్‌లో ఈమేరకు ప్రదర్శన ఉంటుందని కంపెనీ ప్రతినిధులు ప్రకటన విడుదల చేశారు.
ఆర్ట్ కనెక్ట్ కంపెనీని ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి భార్య మిహీకా బాజాజ్ దగ్గుబాటి స్థాపించారు. ఏ అండ్ హెచ్ కోలాబ్ వ్యవస్థాపకులుగా అమృతా కిలాచంద్, హీనా ఓమర్ అహ్మద్ ఉన్నారు. ఈ ప్రదర్శన ప్రధానంగా ల్యామ్, వ్యానా అనే థీమ్‌లతో సాగుతుందని నిర్వాహకులు చెప్పారు. ఇందులో ప్రత్యేక ఆకృతులు, ఆభరణాలు, డిజైనింగ్ వస్తువులు..వంటివి ప్రదర్శనకు ఉంచబోతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మిహీకా బజాజ్ దగ్గుబాటి మాట్లాడుతూ..‘ఆర్ట్ కనెక్ట్ కళాకృతులు, కళాకారులు, వినియోగదారుల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. యూజర్లలో పెరుగుతున్న డిజైన్ స్పృహకు హైదరాబాద్ ప్రసిద్ధి చెందింది. ఇది ఏ అండ్ హెచ్ కొలాబ్ సహకారంతో రూపొందించిన మా ప్రారంభ ఎడిషన్’ అన్నారు. ఏ అండ్ హెచ్ కొలాబ్ వ్యవస్థాపకులు అమృతా కిలాచంద్, హీనా ఓమర్ అహ్మద్ మాట్లాడుతూ..‘ఈ ప్రదర్శన కోసం ఆర్ట్ కనెక్ట్‌తో కలిసి ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకు కళాకృతుల్లో కళను, డిజైన్‌ను మిళితం చేస్తున్నాం’ అన్నారు.