పెళ్లింట చావుడప్పు

Four of family killed in road accident - Sakshi

రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం 

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు 

తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్‌లో ఘటన 

బంధువులకు పెళ్లికార్డు ఇచ్చొస్తుండగా ప్రమాదం

సంఘటన స్థలంలో ముగ్గురు మృతి 

ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు..

నిద్రమత్తే ప్రమాదానికి కారణం   

మృతులంతా ఒకే కుటుంబం 

అల్గునూర్‌/రామగుండం/కోల్‌సిటీ:  పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో ఓ ప్రమాదం చావు డప్పు మోగించింది.పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి. శుభలేఖలు పంచడానికి వెళ్లిన తల్లిదండ్రులు, పెళ్లి పనుల్లో సాయపడ్డానికి వారి వెంట వస్తున్న పెళ్లికొడుకు పెద్దనాన్న, పెద్దమ్మ శవాలై ఇంటికి రావడంతో పెళ్లింట ఆనందం ఆవిరైంది. సంతోషం... సంతాపంగా మారింది. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం కుందనపల్లి గ్రామంలోని రాజీవ్‌ స్వగృహ కాలనీలో విషాదం నింపింది. 

రామగుండం మండలం ఇంధన నిల్వల కేంద్రం సమీపంలోని రాజీవ్‌ స్వగృహలో నివాసముంటున్న కాంబ్లె సరితాబాయి(55)–రవీందర్‌రావు(58) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. చాలా ఏళ్ల క్రితమే వీరి కుటుంబం మహారాష్ట్రలోని లాతూర్‌ నుంచి రామగుండం వచ్చి స్థిరపడింది. రవీందర్‌రావు వెల్డింగ్‌ వర్క్‌షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెద్ద కూతురు పెళ్లి చేశారు. ఇటీవలే పెద్దకుమారుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రితీష్‌ పెళ్లి నిశ్చయించారు. ఈనెల 29న ముహూర్తం పెట్టుకున్నారు. ఈమేరకు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త బట్టలు కొన్నారు. పెళ్లికార్డులు అచ్చువేయించారు. బంధువులను పెళ్లికి ఆహ్వానించేందుకు నాలుగు రోజుల క్రితం సరితాబాయి–రవీందర్‌రావు దంపతులు సొంత కారులో ఇటీవలే మహారాష్ట్రలోని లాతూర్‌ వెళ్లారు. అక్కడ బంధువులందరికీ పెళ్లి కార్డులు ఇచ్చి పెళ్లికి ఆహ్వానించారు. అక్కడే ఉంటున్న సరితాబాయి సోదరి మీరాబాయి(60), ఆమె భర్త రఘునాథ్‌(70)ను తీసుకుని తమ కులదైవమైన షోలాపూర్‌లోని తుల్జామాత ఆలయానికి వెళ్లారు. ఆక్కడ వీరి కుమారుడి పెళ్లి కార్డు ఉంచి పూజలు చేశారు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చారు. అక్కడి బంధువులకు కూడా పెళ్లి కార్డు ఇచ్చి బేగంపేటలో కొడుకు రితేష్‌ నివాసముండే ఫ్లాట్‌కు వెళ్లారు. అక్కడ అందరూ కలిసి భోజనం చేశారు. మిగతా పెళ్లి ఏర్పాట్ల గురించి చర్చించుకున్నారు. రాత్రి 8:30 గంటలకు రామగుండం బయల్దేరారు.

మృత్యువైన ఆగి ఉన్న లారీ.. 
కారులో ఉన్న సరితాబాయి, మీరాబాయి, రఘునాథ్‌ అప్పటికే నిద్రలోకి చారుకున్నారు. రవీందర్‌ కారు డ్రైవ్‌ చేస్తున్నాడు. తిమ్మాపూర్‌ మండలం రేణికుంట టోల్‌గేట్‌ దాటిన సుమారు 20 నిమిషాల్లో కారు అల్గునూర్‌ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్‌ దాటింది. రవీందర్‌ కూడా మెల్లగా నిద్రమత్తులోకి జారుకోవడంతో రెండు నిమిషాల్లో (2:40 గంటలకు) కారు అదుపుతప్పి భారత్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో నిలిపి ఉన్న కేరళ రాష్ట్రానికి చెందిన లారీని వేగంగా ఢీకొట్టింది. పెద్ద శబ్దం రావడంతో బంకు సిబ్బంది హుటాహుటిన అక్కడి చేరుకుని పరిశీలించగా ముగ్గురు రక్తపు మడుగులో విఘత జీవులుకాగా, రఘునాథ్‌ కొనఊపిరితో ఉన్నాడు. వెంటనేఎల్‌ఎండీ పోలీసులకు, 108కు సమాచారం అందించారు. హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై కృష్ణారెడ్డి స్థానికుల సహాయంతో కొన ఊపరితో ఉన్న రఘునాథ్‌ను బయటకు తీసి అప్పటికే సిద్ధంగా ఉన్న 108లో కరీంనగర్‌కు తరలించారు. ఆస్పత్రికి చేరుకునేసరికి రఘునాథ్‌ మృతిచెందాడు. రెండు గంటల్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉండగా మృత్యుఒడిలోకి చేరుకున్నారు. 

పెద్దదిక్కును కోల్పోయారు...
తిమ్మాపూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రవీందర్‌రావు–సరితాబాయి, రఘునాథ్‌–మీరాబాయి దంపతులు మరణించడంతో ఈ రెండు కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. మంగళవారం రాత్రి రామగుండం పంప్‌హౌస్‌ వద్ద రవీందర్‌రావు–సరితాబాయి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. రఘునాథ్,  మీరాబాయి మృతదేహాలను ప్రత్యేక వాహనంలో లాతూర్‌కు తరలించారు. 

ఆ యువకుడు డ్రైవింగ్‌ చేస్తే బతికేవారేమో... 
రామగుండం రాజీవ్‌ స్వగృహలోనే నివాసముంటూ రవీందర్‌రావుకు పరిచయమైన రంజిత్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌  సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటలకు తన స్నేహితుడి కారులో సిద్దిపేట దాబాల వరకు వచ్చాడు. అక్కడి నుంచి తిరిగి బస్సులో రామగుండంకు వచ్చేందుకు చూస్తుండగా... రవీందర్‌రావు కారు కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అందరూ నిద్రపోతున్నారు. రంజిత్‌ రవీందర్‌రావును లేపి ‘అంకుల్‌ మీకు నిద్ర వస్తున్నట్టుగా ఉంది.. నేను డ్రైవింగ్‌ చేస్తాను..’ అని చెప్పాడు. రవీందర్‌రావు అందుకు ‘వద్దు, నేను చాలా కాలంగా కార్లు నడిపిస్తున్నాను, నేనే డ్రైవింగ్‌ చేస్తా’ అని చెప్పడంతో, రంజిత్‌ అక్కడి నుంచి బస్సులో వచ్చాడు. కొంతసేపటికే తిమ్మాపూర్‌ వద్ద జరిగిన ప్రమాదంలో రవీందర్‌రావు కుటుంబం మృత్యు ఒడిలోకి చేరింది. ఒకవేళ రంజిత్‌ ఆ కారును నడిపి ఉంటే నలుగురు బతికేవారేమోనని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన రూరల్‌ ఏసీపీ, ఎమ్మెల్యే..
ప్రమాద సమాచారం అందుకున్న కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ ఉషారాణి, మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. తక్షణం స్పందించి సహాయ చర్యలు చేపట్టిన స్థానికులను, ఎల్‌ఎండీ ఎస్సై కృష్ణారెడ్డి, పోలీస్‌ సిబ్బందిని వారు అభినందించారు. 

మిన్నంటిన రోదనలు.. 
కారులోని పెళ్లికార్డులపై ఉన్న ఫోన్‌ నంబర్ల ఆధారంగా రితీష్‌కు పోలీసులు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాడు. వద్దని వారించినా వినకుండా ఇంటికి బయల్దేరి తెల్లవారే సరికి విఘతజీవులైన తల్లిదండ్రులు, బంధువులను చూసి గుండెంలు బాదుకుంటూ రోదించాడు. వారం రోజుల్లో పెళ్లిపీటలెక్కాల్సిన రితీష్‌ రోదన చూసి స్థానికులు, బంధువులు కంటతడిపెట్టారు. కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనూ బంధువుల రోదనలు మిన్నంటాయి. 

లాతూర్‌లో రఘునాథరావు కుటుంబం...
మహారాష్ట్ర లాతూర్‌లో రఘునాథరావు– మీరాబాయి దంపతులు ఉంటున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలకు పెళ్లి చేశారు. కుమారుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.  మీరాబాయి, సరితాబాయి నలుగురు అక్కాచెల్లెళ్లు. రోడ్డు ప్రమాదంలో మీరాబాయి, సరితాబాయి మృతిచెందగా మిగిలిన ఇద్దరు చెల్లెల్లు అక్కల మృతదేహాలపై రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. 

పరామర్శించిన మంత్రి ఈటల..
ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్‌ కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులను అడిగి తెలుసుకున్నారు. రితేష్, బంధువులను ఓదార్చారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top