కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న పుష్కరాల్లో భక్తులు వదిలేసిన ఆహార పదార్థాలను తిని గురువారం మూడు పశువులు మృతి చెందగా, మరో 40 పశువులు అస్వస్థతకు గురయ్యాయి.
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న పుష్కరాల్లో భక్తులు వదిలేసిన ఆహార పదార్థాలను తిని గురువారం మూడు పశువులు మృతి చెందగా, మరో 40 పశువులు అస్వస్థతకు గురయ్యాయి. నదిలో పుష్కర స్నానమాచరించిన భక్తులు తెచ్చుకున్న ఆహార పదార్థాలు, పూజలకు వినియోగించే సరుకులను ఖాళీ ప్రదేశాల్లో పడేశారు. మేత కోసం గోదావరి ఒడ్డుకు వచ్చిన పశువులు వాటిని తిన్నాయి. దీంతో వాటిలో మూడు పశువులు మృతి చెందగా, మరో 40 పశువులు అస్వస్థతకు గురయ్యాయని మండల పశువైద్యాధికారి రాజబాబు తెలిపారు.
పశువులు అస్వస్థతకు గురైతే 8790997731 నంబర్ కు సమాచారమివ్వాలని, ఇద్దరు పశువైద్యులు, 8 మంది పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. కాగా మిగిలిపోయిన వ్యర్థాలను వెంటనే తొలగించేలా శానిటేషన్ అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. పశువుల యజమానులు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి తమకు నష్టపరిహారం వచ్చేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.