
కాళేశ్వరంపై కమిషన్ నివేదిక ఏకపక్షం, చట్టవిరుద్ధం
బీఆర్‌ఎస్ సర్కార్‌ను ముద్దాయిగా చూపే ప్రయత్నం
నివేదిక కాపీ మాకివ్వమంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు
ఆ కమిషన్‌కు విచారణార్హత లేదు.. నివేదికను కొట్టివేయాలి
మాకు నోటీసులివ్వకుండా ఆదేశాలు జారీ చేయండి
వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన మాజీ సీఎం, మాజీ మంత్రి
నేడో రేపో సింగిల్ జడ్జి విచారణ చేపట్టే చాన్స్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నివేదికను నిలిపివేయాలని కోరు తూ బీఆర్‌ఎస్ అధినేత కే సీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నివేదిక నేపథ్యంలో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అమలు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరు తూ కేసీఆర్‌తో పాటు మాజీమంత్రి హరీశ్‌రావు మంగళ వారం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం–1952 ప్రకారం ప్రభుత్వం తమకు నోటీసులు జారీ చేయకుండా ఆదేశాలివ్వాలని ఉన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. కమిషన్‌కు విచారణార్హత లేదని, నివేదికను కొట్టివేయాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ కార్యదర్శి, కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ ఘోష్‌ను ప్రతివాదులుగా చేర్చారు.
కాపీ ఇవ్వకుండా పదేపదే ఆరోపణలు
‘నివేదిక కాపీని మాకు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 8న లేఖ రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. నివేదిక మా పరువుకు నష్టం కలిగించేలా ఉందని ఈ నెల 4న మీడియా సమావేశంలో మంత్రి వెల్లడించిన విషయాల ద్వారా తెలుస్తోంది. మమ్మల్ని ముద్దాయిలుగా చిత్రీకరిస్తూ, కాపీని ఇవ్వకుండా.. పదేపదే మీడియా ముందు మా ప్రతిష్టను దిగజార్చేలా మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. గత ప్రభుత్వాన్ని, పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఎటువంటి సమర్థనీయమైన ఆధారం లేకుండా అప్రతిష్టపాలు చేసే రాజకీయ వ్యూహంలో భాగంగా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రతివాదులు జీవో 6ను జారీ చేశారు.
నిబంధనల మేరకే బరాజ్‌లు.. అన్నీ పరిశీలించాకే కేంద్రం అనుమతులు
ఏడు జిల్లాలకు తాగు, సాగునీటిని అందించడానికి 160 టీఎంసీల గోదావరి నీటిని వినియోగించి కాళేశ్వరం ఎత్తిపో తలు పథకానికి నిబంధనల మేరకు రూపకల్పన చేసి నిర్మించాం. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడంతో బరాజ్ నిర్మాణాన్ని మరో చోటికి మార్చాలనే నిర్ణయం సహా ప్రతి అంశంపై కేబినెట్ ఆమోదం తర్వాతే చర్యలు చేపట్టాం. 13 జిల్లాలకు నీరందించేలా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వద్ద బరాజ్‌లకు ప్రతిపాదనల నుంచి నిర్మాణం వరకు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కేంద్రం అనుమతి మంజూరు చేసింది’ అని కేసీఆర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
దురుద్దేశపూరితంగానే కమిషన్
‘ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటి నుంచే కాంగ్రెస్ కాళేశ్వరాన్ని అప్రతిష్టపాలు చేస్తూ వస్తోంది. అధిక వర్షపాతంతో మేడిగడ్డ బరాజ్‌లో పిల్లర్ కుంగడం దురదృష్టకరం. దీనికి బరాజ్ రూపకల్పన, ఇంజనీరింగ్‌తో సంబంధం లేదు. అయినా బీఆర్‌ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం దు్రష్పచారం ప్రారంభించింది. చట్ట విరుద్ధంగా, ఏకపక్షంగా, దురుద్దేశపూరితంగా న్యాయవిచారణ కమిషన్ నియమించింది. అయినా ప్రజాజీవితంలో సమగ్రత, నిజాయితీకి కట్టుబడి ఉన్నందున కమిషన్ ముందు హాజరయ్యాం. నివేదిక పూర్తయిన తర్వాత మాకు ఇవ్వకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో మీడియాకు విడుదల చేసింది. దీన్ని పరిశీలిస్తే.. నివేదిక ఏకపక్షమని వెల్లడవుతోంది. విచారణ కమిషన్ చట్టంలోని నిబంధనలనే కాకుండా, చట్టబద్ధత, ప్రాథమిక సూత్రాలను కమిషన్ ఉల్లంఘించింది.
ఎన్నికల్లో లబ్ధి కోసం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి మంత్రులు మా ప్రతిష్టను కించపరిచేలా మీడియా ద్వారా దాడి ప్రారంభించారు. ‘పరిపాలనా అనుమతుల నుంచి నిర్మా ణం వరకు అక్రమాలు జరిగాయి.. అవకతవకలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వారే బాధ్యులు.. ఇది ప్రభుత్వ నిర్ణయం కాదు, వ్యక్తుల నిర్ణయం.. నాటి సీఎం సూచన మేరకే బరాజ్ స్థలాలు ఎంపిక చేశారు.. నిపుణుల కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోలేదు.. రూ.259 కోట్ల పరిపాలనా ఆమోదాన్ని కేబినెట్ ముందుంచలేదు.. సీఎం, హరీశ్ ఆదేశాల మేరకే జారీ చేశారు.. ఖజానాపై అదనపు భారం పడింది..’ లాంటి వాక్యాలను నివేదికలో పేర్కొనడం పరిశీలిస్తే.. కమిషన్ కావాలనే మాకు వ్యతిరేకంగా విచారణ సాగించినట్లు తేటతెల్లం అవుతోంది.
మాతో పాటు నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను బాధ్యుడిగా పేర్కొనడం హాస్యాస్పదం. నివేదికను పరిశీలిస్తే.. పిటిషనర్లపై తప్పుడు భావనతో, ముందస్తు ప్రణాళికతో కమిషన్ విచారణ జరిపినట్లు తెలుస్తోంది. విచారణకు హాజరైన నాటి మంత్రుల వాదనను కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఏకపక్ష నివేదికను రద్దు చేయాలి..’అని పిటిషన్లలో కేసీఆర్, హరీశ్ కోరారు.
ఇదీ నేపథ్యం..
ప్రస్తుతం స్రూ్కటినీ దశలో ఉన్న ఈ పిటిషన్లకు రిజిస్ట్రీ నంబర్ కేటాయించాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లో ఇవి సింగిల్ జడ్జి వద్ద విచారణకొచ్చే అవకాశముంది. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో నిర్లక్ష్యం, లోపాలు, అవకతవకలపై న్యాయ విచారణ జరపాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం..2024 మార్చి 14న పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. జూలై 31న కమిషన్ నివేదిక సమర్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నిర్వహణ లోపాలకు.. కేసీఆర్, హరీశ్, ఈటల కారణమని నివేదిక తేలి్చనట్లు మంత్రి ఉత్తమ్ ప్రకటించగా.. ఈ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.