
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు స్పల్ప ఊరట లభించింది. కాళేశ్వరం సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు బ్రేకులు వేసింది. ఈ కేసులో తదుపరి విచారణ దాకా తొందరపాటు చర్యలు వద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది.
కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించగా.. కమిషన్ నివేదిక ఆధారంగా తమపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్, హరీష్‌రావు తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు సుందరం, శేషాద్రిలు తమ విజ్ఞప్తిని కోర్టుకు తెలియజేశారు. అయితే..
ఈ కేసును సీబీఐకి ఇవ్వనున్నట్లు అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. ‘‘కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక ఆధారంగా సీబీఐకి సిఫార్సు చేశాం. మొత్తం దర్యాప్తు చేయాలని సీఐబీని కోరాం కమిషన్‌తో సంబంధం లేకుండానే సీబీఐ దర్యాప్తు చేస్తుంది. ’’ అని ఏజీ అన్నారు. ఈ క్రమంలో సీబీఐకి తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖను కోర్టుకు అందజేశారాయన.
దీంతో కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయితే దసరా వెకేషన్ తర్వాత ఈ పిటిషన్లపై వాదనలు వింటామని పేర్కొంటూ.. అప్పటిదాకా ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని ఏజీకి స్పష్టం చేసింది. ఈ పిటిషన్ల తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే.. పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా సీబీఐ విచారణ జరపాలని కోరుతూ సీబీఐకి తెలంగాణ ప్రభుత్వం ఓ లేఖ రాసింది. కాళేశ్వరంతో పాటు అంతరాష్ట్ర అంశాలపై దర్యాప్తు చేయాలని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ప్రేమయంపైనా విచారణ జరిపించాలని కోరింది. ఈ మేరకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన విషయాన్ని సైతం లేఖలో వెల్లడించింది.
ఇంకా ఆ లేఖలో.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు ఎన్‌డీఎస్‌ఏ గుర్తించిందని.. ప్రణాళిక, డిజైన్, నాణ్యత, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. అందుకే ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ కూడా విచారణ జరిపి లోపాలను గుర్తించిందని తెలిపింది. ఎన్‌డీఎస్‌ఏ నివేదికపై అసెంబ్లీలో చర్చించామని లేఖలో ప్రభుత్వం ప్రస్తావించింది. మరోవైపు రాష్ట్రానికి సీబీఐ రాకుండా గతంలో ఉన్న ఆదేశాలను సడలిస్తూ జీవో విడుదల చేసింది. సీబీఐ విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈలోపు హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తునకు బ్రేకులు పడ్డట్లయ్యింది.
