
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. పిటిషనర్ల తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. సాక్షిగా విచారణకు పిలిచి రిపోర్ట్ ఇవ్వలేదని హరీష్ తరఫు లాయర్ అన్నారు. నివేదికలో అంశాలు వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా ఉన్నాయని.. లేఖ రాసినా ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. సీఎం ప్రెస్‌మీట్ పెట్టి నివేదికను బయటకు ఇచ్చారన్నారు.
కేసీఆర్ తరఫు లాయర్ తన వాదనలు వినిపిస్తూ.. పబ్లిక్ డొమైన్‌లో కమిషన్ రిపోర్టు ఉందని.. ప్రజెంటేషన్ ద్వారా వివరాలు బయటకు ఇచ్చారని కోర్టుకు వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కమిషన్ ఏర్పాటు చేసినట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. ఘోష్ కమిషన్ రిపోర్టు పబ్లిక్ డొమైన్‌లో లేదన్న ఏజీ.. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించాల్సి ఉందని.. అసెంబ్లీలో చర్చించాకే పబ్లిక్ డొమైన్‌లో పెడతామన్నారు. కౌంటర్ మరిన్ని వివరాలు పొందుపరుస్తామని.. ఈ సమయంలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వొదన్న ఏజీ.. అసెంబ్లీలో చర్చించాక తదుపరి విచారణ చేపట్టాలని ఏజీ కోరారు.
కాగా, కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావులు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. రెండు పిటిషన్లను కలిపి హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ చేపట్టింది.
ఐదు అంశాలను పిటిషన్‌లో పిటిషనర్లు పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక రద్దు చేయాలంటూ కేసీఆర్, హరీష్ రావు కోరారు. కమిషన్‌ను నియమిస్తూ గత ఏడాది ఇచ్చిన జీవోను సైతం కొట్టేయాలంటూ కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్ వేశారు. తమకు కమిషన్ నివేదికను ఇవ్వలేదని కేసీఆర్ పేర్కొన్నారు.
కమిషన్ ఎంక్వయిరీ యాక్ట్ సెక్షన్ 8బి, 8సి నోటీసులు ఇవ్వలేదని.. కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. రిలీఫ్ వస్తుందా..? ఏం జరగబోతోందనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.