
హింస, అశ్లీలం స్థానంలో కామెడీ,కుటుంబ కథలు, షోలపై ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల దృష్టి
ప్రజల సంస్కృతి, భాషలను ప్రతిబింబించేలా కార్యక్రమాల రూపకల్పన
దక్షిణాది సహా దేశంలోని చిన్న పట్టణాల వీక్షకులను ఆకర్షించే యత్నం
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రముఖ ఓవర్ ది టాప్ (ఓటీటీ) స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు అందించే కంటెంట్‌లో సరికొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో నేరప్రవృత్తితో కూడిన, అశ్లీల సంబంధ వెబ్ సిరీస్‌లను రూపొందించి ప్రసారం చేయడం ద్వారా వీక్షకులను ఆకర్షించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు.. ఇటీవల కాలంలో మాత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గ విభిన్న ఇతివృత్తాలతో ముందుకొస్తున్నాయి.
సబ్‌స్క్రైబర్లను పెంచుకోవడంపై తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో దక్షిణాదితో పాటు ద్వితీయ, తృతీయశ్రేణి నగరాలు, పట్టణాలపై ఓటీటీలు ప్రత్యేక దృష్టిపెట్టి ఈ మేరకు మార్పుచేర్పులకు శ్రీకారం చుడు తున్నాయి. ఇందులో భాగంగా దక్షిణాది భాషలకు సంబంధించిన కంటెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు కుటుంబ, స్నేహపూర్వక డ్రామాలు, ప్రేమకథలు, కామెడీలతో కూడిన కంటెంట్‌ను అందించడంపై దృష్టిపెట్టాయి.
స్థానిక భాషల కంటెంట్‌కు డిమాండ్...
ఓటీటీల్లో గతంలో ప్రసారమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఆంగ్లం లేదా హిందీకే పరిమితమవగా ఇటీవల కాలంలో స్థానిక భాషల్లో కంటెంట్‌ను వీక్షించేందుకే ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తమ సొంత సంస్కృతి, భాషను ప్రతిబింబించే షోలు, సినిమాలను వీక్షించాలని సబ్‌స్క్రైబర్లు కోరుకుంటున్నారు. దీంతో తెలుగు, తమిళం, మరాఠీ,బెంగాలీ సహా ఇతర భాషల్లో భిన్నమైన కంటెంట్‌ను అందించడానికి ఓటీటీ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందుకోసం కంటెంట్ సృష్టికర్తలతో జతకడుతున్నాయి.
అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5, ఆభా, హోయిచాయ్ వంటి ప్లాట్‌ఫామ్‌లు ప్రాంతీయ భాషల్లో స్థానిక కంటెంట్‌తో షోలు, సినిమాలను అందించడంలో ముందువరసలో నిలుస్తున్నాయి. బెంగాలీ షోలకు ప్రసిద్ధి చెందిన హోయిచోయ్ భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన బెంగాలీలను కూడా తన సరికొత్త కంటెంట్‌తో వీక్షకులను ఆకర్షించడం ద్వారా సబ్‌స్రై్కబర్ల సంఖ్యను పెంచుకుంది. చౌపాల్ పంజాబీ, హర్యాన్వి, భోజ్‌పురి ప్రేక్షకులకు ప్రాంతీయ అభిరుచులతో లోతుగా ప్రతిధ్వనించే కథలను అందిస్తోంది.
అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ స్థానిక భాషల్లో సినిమాలను నిర్మించడంతోపాటు సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు, టాక్ షోలను అందిస్తున్నాయి. ఈటీవీ విన్, సన్ నెక్ట్స్æ, ఆహా వంటి ఓటీటీలు తెలుగు, తమిళ కంటెంట్‌ను రూపొందించి విడుదల చేయడంపై దృష్టిపెడుతున్నాయి. ఇక జియో హాట్‌స్టార్, సోని లివ్ తదితర ఓటీటీలు సినిమాలు, డ్రామాలు, వెబ్ సిరీస్‌లతోపాటు క్రికెట్ సహా వివిధ క్రీడలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి.
వచ్చే 12–18 నెలల్లో దక్షిణాది భాషల్లో ఒరిజినల్ స్ట్రీమింగ్ టైమింగ్‌ను జియో హాట్‌స్టార్ డబుల్ చేయనుంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ సైతం దక్షిణాది సంబంధ కంటెంట్‌ను మరింతగా అందించడంపై దృష్టిసారిస్తోంది. బిగ్‌బాస్ సౌత్ ఓటీటీని నాలుగు దక్షిణాది భాషల్లో ప్రజలు 400 కోట్ల గంటలకుపైగా వీక్షించారంటే ప్రాంతీయ భాషల్లో షోలకు ఎంత ఆదరణ లభిస్తోందో స్పష్టమవుతోంది.
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అంటే...
ఓటీటీ ప్లాట్‌ఫామ్ అనేది మీడియా ప్రసార మాధ్యమం. ఇందులో ఇంటర్నెట్ ద్వారా కంటెంట్‌ను అందిస్తారు. వీక్షకులు సంబంధిత యాప్‌లను నిర్ణీతరుసుము చెల్లించి సబ్‌స్రై్కబ్ చేసుకొని వాటిల్లోని సినిమాలు, సిరీస్‌లు సహాఆయా యాప్‌లలో ఉండే కంటెంట్‌ను ఎన్ని సార్లయినా చూడొచ్చు.