
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నివేదికను కేసీఆర్, హరీష్‌రావు సవాల్ చేశారు. వేర్వేరుగా రెండు రిట్ పిటిషన్లను వారు దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందని ఆరోపించారు. ప్రభుత్వానికి ఏ విధంగా కావాలో కమిషన్ నివేదిక అదేవిధంగా ఇచ్చిందని.. కమిషన్ నివేదికను నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు కేసీఆర్, హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు.
కాగా, మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైన తర్వాత బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతో పాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. కాగా కమిషన్ 115 మంది సాక్షులను విచారించింది. జూలై 31న సర్కారుకు నివేదిక సమర్పించింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వైఫల్యానికి మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో పాటు నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషీ, నాటి సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్‌ల పాత్ర కూడా ఉన్నట్టుగా వెల్లడించినట్లు సమాచారం. బరాజ్‌ల ప్లానింగ్, నిర్మాణం, పనుల పూర్తి, నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించి జరిగిన అవకతవకల్లో కేసీఆర్ పాత్ర ఉందని వెల్లడించినట్లు సమాచారం.