
6, 8 తేదీల్లో సుప్రీం, హైకోర్టుల్లో బీసీ రిజర్వేషన్, చట్ట సవరణపై విచారణ
కోర్టు తీర్పుల ఆధారంగా వెంటనే స్పందించేందుకు సిద్ధమైన ప్రభుత్వం
ప్రతికూల తీర్పులు వస్తే పాత రిజర్వేషన్ల ప్రకారం వారం ఆలస్యంగా ఎన్నికలు
కొత్తగా షెడ్యూల్ విడుదల చేసి ఎన్నికల నిర్వహణకు పీఆర్ శాఖ ప్రణాళిక
బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ నిర్ణయం తీసుకొనే వరకు వేచిచూసే మరో ప్లాన్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో న్యాయపరమైన చిక్కులు ఎదురైతే.. అందుకు అనుగుణంగా వ్యూహాన్ని మార్చుకుని ‘ప్లాన్ బీ’ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన, మొత్తంగా 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్ల అమలుపై న్యాయస్థానాల్లో ప్రతికూల తీర్పులు వస్తే.. ఏం చేయాలనే దానిపై పంచాయతీరాజ్ శాఖ ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలిసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు ఈ నెల 6న సుప్రీంకోర్టులో, 8వ తేదీన రాష్ట్ర హైకోర్టులో విచారణకు రానున్నాయి.
కోర్టుల వైపు అందరి చూపు..
పంచాయతీరాజ్ చట్ట సవరణ, బీసీలకు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండగా.. ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ జీవోను కొట్టేయాలని గత నెల 27న ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. ఆ పిటిషన్‌పై ఈ నెల 8న హైకోర్టు విచారణ జరపనుంది. నాటి విచారణలో బిల్లు ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండగా జీవో ఎలా జారీ చేస్తారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది.
ఈ దశలో రిజర్వేషన్ల పెంపుదలను ఆమోదించలేమని, అదేవిధంగా ఎలాంటి నిలిపివేత ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది. ఒకవేళ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసినా.. పిటిషన్లు ముందే దాఖలు చేసినందున మెరిట్ ఆధారంగా విచారణ చేస్తామని తెలిపింది. తాము ఇచ్చే తీర్పు మేరకే స్థానిక ఎన్నికలు జరుగుతాయని తేల్చి చెప్పింది. దీంతో 8న కోర్టు ఏం తేలుస్తుందన్నదానిపై ఆసక్తి నెలకొంది.
పాత రిజర్వేషన్ల ప్రకారమూ సిద్ధమే...
సుప్రీం, హైకోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వస్తే పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే (50 శాతానికి లోబడి) ఎన్నికలు నిర్వహించేందుకు కూడా పీఆర్ శాఖ సన్నాహాలు చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్టీ, ఎస్సీల రిజర్వేషన్లను ఖరారు చేసినందున, వాటిని అలాగే ఉంచి గతంలో మాదిరిగా బీసీలకు 23 శాతం రిజర్వేషన్ల కల్పనకు మొగ్గుచూపే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఓటర్ల జాబితాల ఆధారంగా గ్రామపంచాయతీల్లోని వార్డులవారీగా ఫొటోలతో కూడిన ఓటర్ జాబితాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి.
కోర్టుల తీర్పు మేరకు ప్రభుత్వం మళ్లీ బీసీ కోటాపై తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా బీసీ, అన్ రిజర్వ్‌డ్ రిజర్వేషన్లను ఖరారు చేసి, వారంలోనే మరోసారి ఎన్నికల షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఎస్‌ఈసీ జారీచేసిన ఎన్నికల షెడ్యూల్స్ మార్చి వారం రోజుల అంతరంతో నిర్వహించేలా మరోసారి షెడ్యూల్‌ను జారీచేసే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది.
అవసరమైన మార్పులు చేశాక మండల, జిల్లా పరిషత్ ఎన్నికల తొలివిడత నోటిఫికేషన్ 9వ తేదీకి బదులు 16న జారీచేసి, ఎన్నికలను 23వ తేదీకి బదులు 30న నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా మిగతా నాలుగు విడతలకు కూడా వారం రోజుల అంతరంతో నోటిఫికేషన్, మిగతా దశల ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఇలా గతంలో ప్రకటించిన విధంగా నవంబర్ 11కు బదులు 18న ఎన్నికల ప్రక్రియను ముగించే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరో నెల వేచి చూస్తే ఎలా ఉంటుంది?
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే పట్టుదలతో ఉన్న పక్షంలో అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకునే గడువు వరకు వేచి ఉండే అవకాశం లేకపోలేదని అధికారపార్టీ నేతలు చెబుతున్నారు. పెండింగ్ బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్‌లు మూడు నెలల్లోగా తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలని, లేదంటే అవి ఆమోదం పొందినట్టు భావించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.
కాగా, మొదటి రెండు పర్యాయాలు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు, ఆర్డినెన్స్‌లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్ల అమలుపై (పీఆర్ చట్టానికి సవరణలతో) అసెంబ్లీ ఆమోదించిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. మరో 25 రోజులైతే ఆ బిల్లును పంపి 90 రోజులు అవుతుంది. అందువల్ల దీనితోపాటు సుప్రీంకోర్టు, రాష్ట్రపతి నుంచి వచ్చే స్పందనల కోసం మరో నెల వేచి చూస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా అధికార వర్గాల్లో సాగుతోంది.