బోనస్‌ బకాయి రూ.1,159.64 కోట్లు | Farmers protesting for bonus in Telangana Yasangi Crops | Sakshi
Sakshi News home page

బోనస్‌ బకాయి రూ.1,159.64 కోట్లు

Oct 5 2025 1:02 AM | Updated on Oct 5 2025 1:02 AM

Farmers protesting for bonus in Telangana Yasangi Crops

గత యాసంగి సన్నవడ్ల బోనస్‌ ఇప్పటికీ రైతన్నకు అందని వైనం 

మళ్లీ మార్కెట్‌లోకి వస్తున్న వానాకాలం వడ్లు 

సన్నరకం 40 నుంచి 45 ఎల్‌ఎంటీ ఉంటాయని అంచనా 

వాటికి చెల్లించే బోనస్‌ రూ. 2,000 కోట్ల నుంచి రూ. 2,200 కోట్లు  

బోనస్‌ కోసం ఆందోళన బాట పడుతున్న అన్నదాతలు

సన్నధాన్యం పండించే రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తున్నాం. ఈ వానాకాలం సీజన్‌లో 80 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నాం. అందులో 40 నుంచి 45 ఎల్‌ఎంటీ సన్నరకాలే. వీరందరికీ బోనస్‌ ఇస్తాం. 
– మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ చెల్లిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒక్క సీజన్‌కే పరిమితమైంది. గత (2024– 25) వానాకాలం సీజన్‌లో 24 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్నధాన్యం పండించిన సుమారు నాలుగున్నర లక్షల మంది రైతులకు రూ.1,200 కోట్ల వరకు చెల్లించింది. యాసంగి సీజన్‌కు సంబంధించిన బోనస్‌ ఇప్పటి వరకు రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

నారాయణపేట జిల్లా మక్తల్‌ నియోజకవర్గంలోని కృష్ణా ప్రాంత రైతులు ఏకంగా పోరుబాట పట్టారు. బోనస్‌ చెల్లించకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులంతా మూకుమ్మడగా పోటీ చేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. నిజామాబాద్, నల్లగొండ తదితర జిల్లాల్లో సైతం రైతులు యాసంగి బోనస్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఏడాది వానకాలం సీజన్‌ కోతల ప్రక్రియ ప్రారంభమైనా గత యాసంగి బోనస్‌ను విడుదల చేయకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

రైతులకు రావలసిన బోనస్‌ రూ.1,159.64 కోట్లు 
యాసంగి సీజన్‌లో 74.22 ఎల్‌ఎంటీ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో దొడ్డురకం ధాన్యం 51.03 ఎల్‌ఎంటీ కాగా, సన్న ధాన్యం 23.19 ఎల్‌ఎంటీ. ఈ మొత్తం ధాన్యానికి రూ.17,198.58 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం రైతులకు చెల్లించింది. సన్నధాన్యం పండించిన 4,09,031 రైతులకు 1,159.64 కోట్ల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. ధాన్యం కొనుగోళ్లు పూర్తయి మూడు నెలలు దాటినా బోనస్‌ విడుదల చేయలేదు. బోనస్‌ కోసం పోరుబాట పట్టిన మక్తల్‌ రైతులను మంత్రి వాకిటి శ్రీహరి సముదాయించే ప్రయత్నం చేశారే తప్ప బోనస్‌పై హామీ ఇవ్వలేదు. 

ఇటీవల పదవీ విరమణ చేసిన పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ సైతం బోనస్‌ అంశాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని వారం క్రితం మీడియా సమావేశంలో తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్‌ను దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున రైతులు యాసంగిలో కూడా సన్నాలు సాగు చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో 8 లక్షల ఎల్‌ఎంటీ ధాన్యాన్ని సేకరిస్తే, అందులో 7.15 లక్షల ఎల్‌ఎంటీ సన్నాలే ఉన్నాయి. నల్లగొండ, నారాయణపేట, జగిత్యాల, నిర్మల్, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున సన్న ధాన్యాన్ని పండించారు. 

ప్రస్తుత వానకాలం సీజన్‌లో సాగు చేసిన 67.33 లక్షల ఎకరాల్లో 60 శాతానికి పైగా సన్నధాన్యమే పండించినట్లు లెక్కలు చెపుతున్నాయి. ఈసారి కొనుగోలు కేంద్రాలకు 80 ఎల్‌ఎంటీ ధాన్యం వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. ఇందులో 40 నుంచి 45 ఎల్‌ఎంటీ సన్నధాన్యం మార్కెట్‌కు వస్తుందని భావిస్తున్నారు. ఈ మొత్తానికి బోనస్‌ క్వింటాల్‌కు రూ.500 చొప్పున చెల్లిస్తే రూ.2,200 కోట్లు అవుతుంది. ఇప్పటికే ఉన్న బాకాయి 1,159.64 కోట్లు కలిపితే దాదాపు రూ.3,400 కోట్ల వరకు బోనస్‌ చెల్లించాల్సి ఉంటుంది. 

నాకు రూ.5.60 లక్షల బోనస్‌ రావాలి 
నాకు ఉన్న 5 ఎకరాల పొలంతోపాటు కొంత కౌలుకు తీసుకొని రబీలో వరి సాగు చేశాను. 2,800 బస్తాలు పండించాను. మొత్తం 1,120 క్వింటాళ్ల ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో విక్రయించాను. రూ.5.60 లక్షల బోనస్‌ రావాల్సి ఉంది. ఇప్పటికీ ప్రభుత్వం బోనస్‌ ఇవ్వలేదు.  
– వాడ్వాట్‌ తిమ్మన్న, రైతు, గుడే బల్లూరు గ్రామం. 

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తానన్న బోనస్‌ డబ్బులు ఇవ్వక పోవడంతో బాధిత రైతులమంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాం. వచ్చే ఎన్నికల్లో జెడ్పీటీసీకి రైతులందరం రాజకీయాలకు ఆంతీతంగా పోటీ చేయాలని నిర్ణయించాం. 
– చెవిటోళ్ల వెంకటేష్, రైతు, గుడే బల్లూరు గ్రామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement