
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరించింది. ఈ సమయంలో స్టే అవసరం లేదని పేర్కొంది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ సందర్బంగా పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు.. ఘోష్ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కేసీఆర్, హరీష్ ఇద్దరూ ఎమ్మెల్యేలు కాబట్టి అసెంబ్లీలో చర్చించాకే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫున ఏజీ చెప్పుకొచ్చారు.
హైకోర్టులో ప్రభుత్వం నిర్ణయాన్ని తెలిపిన ఏజీ..
కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. శుక్రవారం వాదనల్లో భాగంగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టుకు ఏజీ వివరించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని కాపీ రూపకంగా అందజేశారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నివేదికపై ముందుకు వెళ్తామన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఆరు నెలలు సమయం ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో కమిషన్ నివేదికను వెబ్‌సైట్లలో పెట్టడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ క్రమంలో వెబ్‌సైట్‌లలో నివేదిక ఉంటే వెంటనే తొలగించాలని ఆదేశించింది.
గురువారం జరిగింది ఇదే..
ఇదిలా ఉండగా.. కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేసిన పిటిషన్లపై నేడు మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణ చేపట్టింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అమలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ విచారణ చేపట్టారు.
ఇక, వీరిద్దరి పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక ప్రశ్నలు సంధించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాలని నిర్ణయించినప్పుడు మీడియా భేటీలో ఎందుకు బహిర్గతం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అధికారికంగా నివేదికను మీడియాకు అందజేశారా?. మీరు విడుదల చేయకుంటే మీడియాకు కాపీ ఎలా వచ్చింది? అసెంబ్లీలో చర్చించారా?.. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే ఉద్దేశం ఉందా?.. అని అడిగింది. కమిషన్ నివేదికను అధికారికంగా విడుదల చేయలేదని, అసెంబ్లీలో ఇంకా చర్చించలేదని అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి బదులిచ్చారు. ప్రధాన న్యాయమూర్తి అడిగిన వివరాలతో పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.