
సర్కారుకు స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ సిఫారసు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగాల నిర్మాణంపై ప్రాజెక్టు నిర్మాణ సంస్థ అయిన జయప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్‌తో 2005 ఆగస్టు 25న చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖలోని స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్‌ఎల్‌ఎస్‌సీ) రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆస్తులతో పోల్చితే అప్పులు మించిపోయి దివాలా తీయడంతో జయప్రకాశ్ అసోసియేట్స్ సంస్థ వ్యాపార దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ)ను చేపడుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అలహాబాద్ బెంచ్ 2024 జూన్ 3న ఉత్తర్వులు జారీ చేసింది. దివాలా ప్రక్రియ కాలంలో జేపీ అసోసియేట్స్ కంపెనీ వ్యవహారాల పర్యవేక్షణకు రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ) అనే థర్డ్ పార్టీ ఏజెన్సీని ఎన్సీఎల్టీ నియమించింది.
సొరంగం–1 నిర్మాణ విషయంలో కంపెనీ పనితీరుపై ఆర్పీ హామీ ఇవ్వడానికి ఇష్టపడకపోయినా, హామీ ఇచ్చే పరిస్థితిలో లేకున్నా.. ఎన్సీఎల్టీ అనుమతితో ఒప్పందాన్ని రద్దు చేసుకొని మిగిలిన పనుల పూర్తికి మళ్లీ టెండర్లు నిర్వహించాలని ఎస్‌ఎల్‌ఎస్‌సీ సిఫారసు చేసింది. పనితీరుపై ఆర్పీ రాతపూర్వకంగా హామీ ఇస్తే పలు షరతులతో జయ ప్రకాశ్ అసోసియేట్స్ ఆధ్వర్యంలోనే మిగిలిన పనులు జరిపించాలని మరో ప్రత్యామ్నాయాన్ని ఎస్‌ఎల్‌ఎస్‌సీ సూచించింది. సొరంగాల నిర్మాణం పనులను ముందుకు తీసుకెళ్లే అంశంపై నల్లగొండ సీఈ చేసిన పలు ప్రతిపాదనలపై గత నెల 12న నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) అధ్యక్షతన సమావేశమైన స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ విస్తృతంగా చర్చించి ఈ మేరకు రెండు ప్రత్యామ్నాయాలను సర్కారుకు సూచించింది.
ఒక వేళ ఒప్పందాన్ని రద్దు చేస్తే కొత్త నిర్మాణ సంస్థతో పనులు చేయిస్తే తీవ్ర జాప్యంతోపాటు పెరిగిన మార్కెట్ ధరలకు అనుగుణంగా ఆర్థిక భారం సైతం పడనుందని తేల్చి చెప్పింది. అర్ధంతరంగా నిలిచిపోయిన సొరంగం నిర్మాణ పనులను చేపట్టే విషయంలో సాంకేతిక సమస్యలూ ఎదురవుతాయని స్పష్టం చేసింది. ఎస్‌ఎల్‌ఎస్‌సీ సిఫారసులను త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది.
మళ్లీ అంచనాలను పెంచొద్దు
ఒకవేళ జేపీ అసోసియేట్స్‌తోనే ఒకటో సొరంగం పనులు కొనసాగిస్తే రెండోసారి సవరించి అంచనాల మేరకు మిగుల పనుల వ్యయం రూ.1157.42 కోట్లకు మించకుండా సీలింగ్ విధించాలని స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. నవీకరించిన పనుల షెడ్యూల్ ప్రకారం పనులను గడువును 2028 జూన్ 30కి పెంచేందుకు ఓకే చెప్పింది. సీఈ, రిజాల్యూషన్ ప్రొఫెషనల్ పేరుతో సంయుక్తంగా నిర్వహించే ఎస్క్రో అకౌంట్‌కే బిల్లులు చెల్లించాలని సూచించింది.
అత్యాధునిక టెక్నాలజీతో పనులు చేస్తాం..: జేపీ అసోసియేట్స్
⇒ ప్రాజెక్టులో భాగంగా రెండు సొరంగాలను తవ్వాల్సి ఉండగా, 7.13 కి.మీ.ల రెండో సొరంగం తవ్వకాలు పూర్తి కాగా, 2.8 కి.మీల మేర లైనింగ్ పనులు జరగాల్సి ఉంది.
⇒ 43.93 కి.మీ.ల తొలి సొరంగం పనులకుగాను రెండు వైపుల నుంచి మొత్తం 34.38 కి.మీల మేర పనులు పూర్తయ్యాయి. మధ్యలో 9.541 కి.మీ.ల సొరంగం తవ్వకాలు జరగాల్సి ఉంది.
⇒ గత ఫిబ్రవరిలో సొరంగం కుప్పకూలి కారి్మకులు మృతిచెందడంతో పనులు నిలిచిపోయాయి.
⇒ రెండోసారి సవరించిన అంచనాల ప్రకారం ఒకటో సొరంగానికి సంబంధించి రూ.1157.42 కోట్లు, రెండో సొరంగానికి సంబంధించి రూ.57.08 కోట్లు విలువైన పనులు జరగాల్సి ఉంది.
⇒ ఇప్పటి వరకు టన్నెల్ బోరింగ్ మెషిన్ల(టీబీఎం)తో సొరంగాల తవ్వకాలు జరగగా, ఇటీవల జరిగిన ప్రమాద నేపథ్యంలో ఇతర అత్యాధునిక పద్ధతుల్లో ఇదే వ్యయంతో పనులు చేసేందుకు జేసీ అసోసియేట్స్ పలు షరతులతో సంసిద్ధత వ్యక్తం చేసింది.
⇒ 2028 ఆగస్టు 30 వరకు గడువు పొడిగించడంతో పాటు బిల్లుల చెల్లింపు షెడ్యూల్‌లో మార్పులు చేయాలని, బిల్లులను సమరి్పంచిన 24 గంటల్లోనే గ్రీన్ చానల్ ద్వారా చెల్లింపులు జరపాలని, రూ.35.14 కోట్ల పెండింగ్ బిల్లులు, రూ.104 కోట్ల విద్యుత్ చార్జీలు చెల్లించాలనే షరతులను విధించింది.