breaking news
SLSC
-
ఎస్ఎల్బీసీ కాంట్రాక్ట్ రద్దు!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగాల నిర్మాణంపై ప్రాజెక్టు నిర్మాణ సంస్థ అయిన జయప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్‌తో 2005 ఆగస్టు 25న చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖలోని స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ) రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆస్తులతో పోల్చితే అప్పులు మించిపోయి దివాలా తీయడంతో జయప్రకాశ్ అసోసియేట్స్ సంస్థ వ్యాపార దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ)ను చేపడుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అలహాబాద్ బెంచ్ 2024 జూన్ 3న ఉత్తర్వులు జారీ చేసింది. దివాలా ప్రక్రియ కాలంలో జేపీ అసోసియేట్స్ కంపెనీ వ్యవహారాల పర్యవేక్షణకు రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ) అనే థర్డ్ పార్టీ ఏజెన్సీని ఎన్సీఎల్టీ నియమించింది. సొరంగం–1 నిర్మాణ విషయంలో కంపెనీ పనితీరుపై ఆర్పీ హామీ ఇవ్వడానికి ఇష్టపడకపోయినా, హామీ ఇచ్చే పరిస్థితిలో లేకున్నా.. ఎన్సీఎల్టీ అనుమతితో ఒప్పందాన్ని రద్దు చేసుకొని మిగిలిన పనుల పూర్తికి మళ్లీ టెండర్లు నిర్వహించాలని ఎస్ఎల్ఎస్సీ సిఫారసు చేసింది. పనితీరుపై ఆర్పీ రాతపూర్వకంగా హామీ ఇస్తే పలు షరతులతో జయ ప్రకాశ్ అసోసియేట్స్ ఆధ్వర్యంలోనే మిగిలిన పనులు జరిపించాలని మరో ప్రత్యామ్నాయాన్ని ఎస్ఎల్ఎస్సీ సూచించింది. సొరంగాల నిర్మాణం పనులను ముందుకు తీసుకెళ్లే అంశంపై నల్లగొండ సీఈ చేసిన పలు ప్రతిపాదనలపై గత నెల 12న నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) అధ్యక్షతన సమావేశమైన స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ విస్తృతంగా చర్చించి ఈ మేరకు రెండు ప్రత్యామ్నాయాలను సర్కారుకు సూచించింది. ఒక వేళ ఒప్పందాన్ని రద్దు చేస్తే కొత్త నిర్మాణ సంస్థతో పనులు చేయిస్తే తీవ్ర జాప్యంతోపాటు పెరిగిన మార్కెట్ ధరలకు అనుగుణంగా ఆర్థిక భారం సైతం పడనుందని తేల్చి చెప్పింది. అర్ధంతరంగా నిలిచిపోయిన సొరంగం నిర్మాణ పనులను చేపట్టే విషయంలో సాంకేతిక సమస్యలూ ఎదురవుతాయని స్పష్టం చేసింది. ఎస్ఎల్ఎస్సీ సిఫారసులను త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది. మళ్లీ అంచనాలను పెంచొద్దు ఒకవేళ జేపీ అసోసియేట్స్తోనే ఒకటో సొరంగం పనులు కొనసాగిస్తే రెండోసారి సవరించి అంచనాల మేరకు మిగుల పనుల వ్యయం రూ.1157.42 కోట్లకు మించకుండా సీలింగ్ విధించాలని స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. నవీకరించిన పనుల షెడ్యూల్ ప్రకారం పనులను గడువును 2028 జూన్ 30కి పెంచేందుకు ఓకే చెప్పింది. సీఈ, రిజాల్యూషన్ ప్రొఫెషనల్ పేరుతో సంయుక్తంగా నిర్వహించే ఎస్క్రో అకౌంట్‌కే బిల్లులు చెల్లించాలని సూచించింది. అత్యాధునిక టెక్నాలజీతో పనులు చేస్తాం..: జేపీ అసోసియేట్స్ ⇒ ప్రాజెక్టులో భాగంగా రెండు సొరంగాలను తవ్వాల్సి ఉండగా, 7.13 కి.మీ.ల రెండో సొరంగం తవ్వకాలు పూర్తి కాగా, 2.8 కి.మీల మేర లైనింగ్ పనులు జరగాల్సి ఉంది. ⇒ 43.93 కి.మీ.ల తొలి సొరంగం పనులకుగాను రెండు వైపుల నుంచి మొత్తం 34.38 కి.మీల మేర పనులు పూర్తయ్యాయి. మధ్యలో 9.541 కి.మీ.ల సొరంగం తవ్వకాలు జరగాల్సి ఉంది. ⇒ గత ఫిబ్రవరిలో సొరంగం కుప్పకూలి కారి్మకులు మృతిచెందడంతో పనులు నిలిచిపోయాయి. ⇒ రెండోసారి సవరించిన అంచనాల ప్రకారం ఒకటో సొరంగానికి సంబంధించి రూ.1157.42 కోట్లు, రెండో సొరంగానికి సంబంధించి రూ.57.08 కోట్లు విలువైన పనులు జరగాల్సి ఉంది. ⇒ ఇప్పటి వరకు టన్నెల్ బోరింగ్ మెషిన్ల(టీబీఎం)తో సొరంగాల తవ్వకాలు జరగగా, ఇటీవల జరిగిన ప్రమాద నేపథ్యంలో ఇతర అత్యాధునిక పద్ధతుల్లో ఇదే వ్యయంతో పనులు చేసేందుకు జేసీ అసోసియేట్స్ పలు షరతులతో సంసిద్ధత వ్యక్తం చేసింది. ⇒ 2028 ఆగస్టు 30 వరకు గడువు పొడిగించడంతో పాటు బిల్లుల చెల్లింపు షెడ్యూల్లో మార్పులు చేయాలని, బిల్లులను సమరి్పంచిన 24 గంటల్లోనే గ్రీన్ చానల్ ద్వారా చెల్లింపులు జరపాలని, రూ.35.14 కోట్ల పెండింగ్ బిల్లులు, రూ.104 కోట్ల విద్యుత్ చార్జీలు చెల్లించాలనే షరతులను విధించింది. -
ఇంధన సామర్థ్యంలో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: ఇంధన పొదుపు, సామర్థ్యంలో వినూత్న ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. భారీ స్థాయిలో ఇంధనాన్ని ఆదా చేయడం ద్వారా ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా మారింది. ఏపీని చూసి నేర్చుకోవాలని ఇతర రాష్ట్రాలకు కేంద్రం చెప్పే స్థాయికి చేరుకుంది. ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుకు ఏపీ అనుసరిస్తున్న ‘రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ)’కి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఏపీని ఆదర్శంగా తీసుకుని 18 రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) తెలిపింది. బీఈఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మూడేళ్లుగా ఏటా రూ.3,914 కోట్ల విలువైన 5,608 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఆదా చేస్తోంది. ఇందులో ఒక్క పాట్ పథకం ద్వారానే 3,430 మిలియన్ యూనిట్ల విద్యుత్తును పొదుపు చేసింది. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ప్రత్యేకమైన ఐవోటీ ఆధారిత విద్యుత్తు పర్యవేక్షణ డివైస్‌ను రాష్ట్రంలోని 65 ఎంఎస్ఎంఈల్లో ప్రవేశపెట్టింది. ఇది యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ’ఏపీఎస్ఈసీఎం’కు ప్రశంసలు రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలు, పర్యవేక్షణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీయే ఈ ఎస్ఎల్ఎస్సీ. ఈ కమిటీ నేతృత్వంలో ఇంధన సామర్థ్య చట్టాన్ని రాష్ట్ర స్థాయిలో అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఏపీఎస్ఈసీఎం సేవలను బీఈఈ డీజీ అభయ్ భాక్రే ప్రశంసించారు. ఏపీ మోడల్ ఎస్ఎల్ఎస్సీ విధానాన్ని ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, హరియాణ, తమిళనాడు, తెలంగాణ సహా 18 రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని వెల్లడించారు. ఇంధన సామర్థ్యం, సంరక్షణ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, భాగస్వాముల్లో చైతన్యం తెస్తున్న ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డిని బీఈఈ డైరెక్టర్ జనరల్‌తోపాటు క్లైమేట్ అండ్ ఎనర్జీ లీడ్ బ్రిటిష్ హై కమిషన్ లిబ్బి గ్రీన్, ఈఈఎస్ఎల్ ఎండీ విశాల్ కపూర్ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అంకిత భావంతో పనిచేయడం వల్లే ఏపీఎస్ఈసీఎం దేశంలోనే ప్రతిష్ఠాత్మక జాతీయ ఇంధన సంరక్షణ అవార్డు–2022, ఇతర అవార్డులను గెలుచుకుందని భాక్రే చెప్పారు. ఏపీఎస్ఈసీఎం ద్వారా బీఈఈ తొలిసారిగా విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ బజార్ నిర్వహించి, ఇతర రాష్ట్రాలకు మార్గాన్ని చూపిందన్నారు. ఫలితంగా దేశం మొత్తం మీద రూ.2,500 కోట్ల విలువైన 73 ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను గుర్తించామని చెప్పారు. ఇందులో ఒక్క ఏపీలోనే రూ.400 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ..దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేలా ప్రోత్సహిస్తున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బీఈఈ డైరెక్టర్, కార్యదర్శికి, ఏపీఎస్ఈసీఎం చైర్మన్ కె.ఎస్.జవహర్ రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు -
20 నెలల తర్వాత ఎస్ఎల్ఎస్సీ సమావేశం
జాతీయ పట్టణ నవీకరణ పథకం కింద రాష్ట్రానికి రూ. 2,130 కోట్లు కావాలని రాష్ట్రస్థాయి మంజూరు కమిటీ (స్టేట్ లెవల్ శాంక్షన్ కమిటీ) కేంద్రానికి ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో సమావేశమైన ఎస్ఎల్ఎస్సీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తే... అక్కడ దాదాపు డజను శాఖల కార్యదర్శుల కమిటీ సమావేశమై ఈ ప్రతిపాదనలను పరిశీలించి వాటికి ఆమోదం తెలిపిన పక్షంలోనే నిధులు విడుదల అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పంపించడంలో విపరీతమైన జాప్యం చేయడంవల్ల మొదట్లో రూ. 2,500 కోట్ల విలువైన ప్రతిపాదనలకు ప్రణాళిక సిద్ధం చేసినా చివరకు 2,130 కోట్ల రూపాయల ప్రతిపాదనలే కేంద్రానికి పంపించాలని ముఖ్యమంత్రి నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. కమిటీ ఉపాధ్యక్షుడు, పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి లేకుండానే సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, గ్రేటర్ విశాఖపట్టణం కార్పొరేషన్, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్లలో మంచినీరు (రూ. 777.92 కోట్లు), వరద నీటి కాలువలు(136.43 కోట్లు), ఘనవ్యర్థ పదార్థాల నిర్వహణ(491.17 కోట్లు), రహదారులు, ఆర్వోబీలు(337.21 కోట్లు), బస్సుల కొనుగోలు(రూ. 388.02 కోట్లు) ప్రతిపాదనలకు కమిటీ ఆమోదం తెలిపింది. మహా ఆలస్యం: జాతీయ పట్టణ నవీకరణ పథకం మొదటి దశలో మహారాష్ట్ర తరువాత కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు రాబట్టుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హం. రెండో దశ పథకాన్ని 2014-15 నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.14 వేల కోట్లు బడ్జెట్లో పెట్టిన విషయం విదితమే. ఈ నిధుల కోసం పలు రాష్ట్రాలు ఇప్పటికే ప్రతిపాదనలను కేంద్రానికి పంపి ఆమోదముద్ర పొందుతున్నాయి. కానీ రాష్ట్రప్రభుత్వం మాత్రం ఈసారి చాలా ఆలస్యంగా ప్రతిపాదనలు పంపిస్తోంది. ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఈ కమిటీ 2012 జనవరి తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు సమావేశం కావడం గమనార్హం. జాతీయ పట్టణ నవీకరణ పథకం మొదటి దశలో మొత్తం రూ.12,553 కోట్లతో 253 పథకాలు చేపట్టగా అందులో 148 పథకాలు పూర్తి చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. మరో 55 పథకాలు పూర్తికావడానికి దగ్గర్లో ఉన్నాయని, మిగిలిన పథకాలన్నీ వచ్చే మార్చినాటికి పూర్తి చేస్తామని చెప్పారు. సమావేశంలో సభ్యులు మల్లాది విష్ణు, సైనాల విజయకుమార్‌తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.