20 నెలల తర్వాత ఎస్‌ఎల్‌ఎస్‌సీ సమావేశం | SLSC Meeting after 20 months | Sakshi
Sakshi News home page

20 నెలల తర్వాత ఎస్‌ఎల్‌ఎస్‌సీ సమావేశం

Sep 3 2013 3:49 AM | Updated on Sep 1 2017 10:22 PM

జాతీయ పట్టణ నవీకరణ పథకం కింద రాష్ట్రానికి రూ. 2,130 కోట్లు కావాలని రాష్ట్రస్థాయి మంజూరు కమిటీ (స్టేట్ లెవల్ శాంక్షన్ కమిటీ) కేంద్రానికి ప్రతిపాదించింది.

జాతీయ పట్టణ నవీకరణ పథకం కింద రాష్ట్రానికి రూ. 2,130 కోట్లు కావాలని రాష్ట్రస్థాయి మంజూరు కమిటీ (స్టేట్ లెవల్ శాంక్షన్ కమిటీ) కేంద్రానికి ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో సమావేశమైన ఎస్‌ఎల్‌ఎస్‌సీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తే... అక్కడ దాదాపు డజను శాఖల కార్యదర్శుల కమిటీ సమావేశమై ఈ ప్రతిపాదనలను పరిశీలించి వాటికి  ఆమోదం తెలిపిన పక్షంలోనే నిధులు విడుదల అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పంపించడంలో విపరీతమైన జాప్యం చేయడంవల్ల మొదట్లో రూ. 2,500 కోట్ల విలువైన ప్రతిపాదనలకు ప్రణాళిక సిద్ధం చేసినా చివరకు 2,130 కోట్ల రూపాయల ప్రతిపాదనలే కేంద్రానికి పంపించాలని ముఖ్యమంత్రి నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. కమిటీ ఉపాధ్యక్షుడు, పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి లేకుండానే  సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, గ్రేటర్ విశాఖపట్టణం కార్పొరేషన్, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్లలో మంచినీరు (రూ. 777.92 కోట్లు), వరద నీటి కాలువలు(136.43 కోట్లు), ఘనవ్యర్థ పదార్థాల నిర్వహణ(491.17 కోట్లు), రహదారులు, ఆర్వోబీలు(337.21 కోట్లు), బస్సుల కొనుగోలు(రూ. 388.02 కోట్లు) ప్రతిపాదనలకు కమిటీ ఆమోదం తెలిపింది. 
 
 మహా ఆలస్యం: జాతీయ పట్టణ నవీకరణ పథకం మొదటి దశలో మహారాష్ట్ర తరువాత కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు రాబట్టుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హం. రెండో దశ పథకాన్ని 2014-15 నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.14 వేల కోట్లు బడ్జెట్‌లో పెట్టిన విషయం విదితమే. ఈ నిధుల కోసం పలు రాష్ట్రాలు ఇప్పటికే ప్రతిపాదనలను కేంద్రానికి పంపి ఆమోదముద్ర పొందుతున్నాయి.
 
  కానీ రాష్ట్రప్రభుత్వం మాత్రం ఈసారి చాలా ఆలస్యంగా ప్రతిపాదనలు పంపిస్తోంది. ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఈ కమిటీ 2012 జనవరి తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు సమావేశం కావడం గమనార్హం. జాతీయ పట్టణ నవీకరణ పథకం మొదటి దశలో మొత్తం రూ.12,553 కోట్లతో 253 పథకాలు చేపట్టగా అందులో 148 పథకాలు పూర్తి చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. మరో 55 పథకాలు పూర్తికావడానికి దగ్గర్లో ఉన్నాయని, మిగిలిన పథకాలన్నీ వచ్చే మార్చినాటికి పూర్తి చేస్తామని చెప్పారు. సమావేశంలో సభ్యులు మల్లాది విష్ణు, సైనాల విజయకుమార్‌తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

పోల్

Advertisement