వారి వల్ల ప్రాణహానీ ఉంది: దాసరి భూమయ్య

Former CI Dasari Bhumayya Open Letter To CM KCR  - Sakshi

సాక్షి, కరీంనగర్‌: రిటైర్డు డీఎస్పీ, ప్రస్తుతం ఎస్‌ఐబీలో పనిచేస్తున్న వేణుగోపాల్‌రావుతో పాటు, హైదరాబాద్‌కు చెందిన ఎక్కటి జైపాల్‌రెడ్డి అనే వ్యక్తితో తనకు ప్రాణహాని ఉందని రిటైర్డు సీఐ, పీసీసీ అధికార ప్రతినిధి దాసరి భూమయ్య ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ పంపారు. బుధవారం భూమయ్య తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పోలీసు అధికారిగా విధి నిర్వహణలో నిక్కచ్చిగా పనిచేసిన తనకు అప్పటి ప్రభుత్వాలు ఎన్నో అవార్డులు, రివార్డులు ఇచ్చాయని, బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్‌తో పాటు నలుగురు గన్‌మెన్లను ఇచ్చిందని గుర్తుచేశారు.

పోలీసుశాఖలో అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండి, విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించడం వల్ల రిటైర్డు డీఎస్పీ వేణుగోపాల్‌రావుతో పాటు కొంత మంది తనపై కక్ష కట్టారని ఆరోపించారు. హుస్నాబాద్‌ పోలీసుస్టేషన్‌లో మాయమైన తుపాకుల కేసులో తనను ఇరికించి మనోవేదనకు గురి చేశారన్నారు. హుస్నాబాద్‌ తుపాకుల కేసు విషయం తేటతెల్లమైందని గుర్తు చేశారు. ఎలాగైనా ఇబ్బందుల పాలు చేయాలని తనను 2018 సంవత్సరంలో ఏసీబీ కేసులో ఇరికించి జైలుపాలు చేశారని, ఆ కేసు కోర్టు పరిధిలో ఉందని నిర్దోషిగా బయటపడుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా పోలీసు ఇన్‌ఫార్మర్‌ అయిన హైదరాబాద్‌కు చెందిన ఎక్కటి జైపాల్‌రెడ్డి అనే వ్యక్తి తనపై హైదరాబాద్‌లో చైతన్యపురి పోలీసుస్టేషన్‌లో మరోకేసు నమోదు చేయించారని, కట్టుకథలు అల్లుతూ తనను ఎలాగైనా అంతమొందించాలని పోలీసు అధికారి వేణుగోపాల్‌రావు కొత్త కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. జైపాల్‌రెడ్డి అనే వ్యక్తిని చంపేందుకు తాను సుపారీ ఇచ్చి కొందరిని పంపించానని, వాళ్లు తనకు లొంగిపోయారని జైపాల్‌రెడ్డి చెప్పడాన్ని చూస్తుంటే ఏదో కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తంచేశారు.

నక్సలైట్లకు  టార్గెట్‌గా ఉండి ప్రభుత్వ పక్షాన ఉన్న తనకు గన్‌మెన్లను తొలగించడమే కాకుండా ఏసీబీ కేసు నమోదైందనే సాకుతో తన గన్‌ లైసెన్స్‌ను సైతం రద్దు చేశారని ఆరోపించారు. జైపాల్‌రెడ్డి వద్ద రెండు లైసెన్స్‌డ్‌ తుపాకులు ఉన్నాయని, అతనికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో సంబంధాలు ఉన్నాయని, అలాంటి వ్యక్తిని నిరాయుధుడైన తాను ఎలా చంపగలనని ప్రశ్నించారు. జైపాల్‌రెడ్డిని పోలీసులే అంతమొందించి, ఆ నేరాన్ని తనపై నెట్టే ప్రమాదం ఉందని కూడా అనుమానం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలకు సూత్రధారి, పాత్రధారి అయిన వేణుగోపాల్‌రావును వెంటనే ఎస్‌ఐబీ ఉద్యోగం నుంచి తొలగించి ప్రభుత్వం నిజాయితీని నిరూపించుకోవాలని కోరారు. ఈ విషయమై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కుంతియాకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top