సాగర్‌లో విమానాల హోరు!

Flight Services at the Nagarjunasagar reservoir - Sakshi

నాగార్జునసాగర్‌: రాబోయే రోజుల్లో నాగార్జునసాగర్‌ జలాశయంలో విమానాల హోరు వినిపించనుంది. చిన్న పట్టణాలను రవాణాపరంగా అనుసంధానించేందుకు జల విమానాలను వాణిజ్య సేవలకు వినియోగించనున్నారు. ఈ నేపథ్యంలో పోర్టుకు అనువుగా ఉన్న నాగార్జునసాగర్‌ను ఎంపిక చేశారు. ఏప్రిల్‌ తొలి వారంలో పౌర విమానయాన శాఖ అధికారి కెప్టెన్‌ ఇల్షాద్‌ అహ్మద్‌ నేతృత్వంలో నిపుణుల బృందం హెడ్రోపోర్టు ఏర్పాటుకు సాగర్‌ జలాశయాన్ని పరిశీలించింది.

రవాణాపరంగా జలాశయాలను వినియోగించేందుకు సాధ్యమేనని, త్వరలోనే ఇది కార్యరూపం దాల్చేందుకు డీజీసీఏ నిబంధనలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ, ఏపీలో రిజర్వాయర్‌ కనెక్టింగ్‌ సర్వీస్‌ 9, 12, 20 సీట్ల సామర్థ్యం కలిగిన విమాన సర్వీసులను నడపనున్నారు. సాగర్‌తోపాటు శ్రీశైలం, హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ అనుకూలమేనని సర్వేలో తేలింది. కేంద్ర ప్రభుత్వ ‘ఉడాన్‌’పథకం విమాన సర్వీసులను సామాన్యులకు చేరువ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. విమాన సర్వీసులు ప్రారంభమైతే నాగార్జునసాగర్‌కు పలు దేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. జలాశయంలో ఏర్పాటు చేసే హైడ్రో పోర్టును తెలంగాణ వైపు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top