హ్యుమానిటీ జిందాబాద్ | Fitness Programme For Social Service | Sakshi
Sakshi News home page

హ్యుమానిటీ జిందాబాద్

Oct 22 2019 10:44 AM | Updated on Oct 22 2019 10:44 AM

Fitness Programme For Social Service - Sakshi

అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన చిన్నారులు, అయినవారితో ఉండాల్సిన మహిళలు అనాథలయ్యారు. ఎవరో చేసిన పాపానికి వీరు శిక్షఅనుభవిస్తున్నారు. అలాంటి వారి కోసం సిటీకి చెందిన పలువురు ఫిట్‌నెస్‌ ట్రైనర్లు ‘జిన్‌’ వేదికగా చేయి కలిపారు. ఆరోగ్యాన్ని మాత్రమే కాదు అసహాయులను ఆదుకోవడంలో కూడా సిటీజనులకు స్ఫూర్తిగా నిలిచారు. 

జిన్‌ నేపథ్యం...
నగరంలో జుంబా శిక్షకులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారని, వీరిలో అత్యధికులు మహిళలనీ కూడా మనకు తెలుసు. అయితే వీరంతా ఒక వేదికను ఏర్పాటు చేసుకుని ఫిట్‌నెస్‌ను మాత్రమే కాదు మంచిని కూడా పంచుతున్నారని చాలా మందికి తెలియకపోవచ్చు. జుంబా ఇన్‌స్ట్రక్టర్స్‌ నెట్‌వర్క్‌ (జిన్‌)పేరుతో నెలకొల్పిన ఈ సంస్థ గత కొంత కాలంగా పలు రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. అదే క్రమంలో జిఆర్‌వైసిఎస్‌ సహకారంతో నగరంలో ఆదివారం స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. జుంబా ఫిట్‌నెస్‌ పార్టీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఎప్పటిలా ఔత్సాహికుల ఆరోగ్యం కోసం మాత్రమే కాదు  నగరంలోని చైతన్య మహిళా మండలి అనే ఎన్‌జీఓ బాగు కోసం కూడా. 

జుంబా ఫిట్‌నెస్‌ పార్టీ... బహుశా నగరంలో ఇలాంటి పార్టీ గతంలో ఎవరూ చూసి ఉండకపోవచ్చు. ఒకవేళ చూసినా వీరు ఎంచుకున్న నేపథ్యం లాంటిది విని ఉండకపోవచ్చు. అవును ఆరోగ్యం కోసం ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహించే జుంబా ట్రైనర్లు అనాథల కోసం ఫిట్‌ ఈవెంట్‌ నిర్వహించారు. కలిసికట్టుగా ఆరోగ్యకరమైన సమాజం వైపు వేసే అడుగుల్లో మానవత్వాన్ని మేళవించారు.

ఈవెంట్‌ ఇలా..
ఒక్క జుంబా ట్రైనర్‌ వచ్చి ఈవెంట్‌ చేస్తేనే ప్రాంగణం అంతా హోరెత్తిపోతుంది. అలాంటిది నగరంలో ఉన్న జుంబా ట్రైనర్లు దాదాపు అందరూ వచ్చి ఫిట్‌నెస్‌ పార్టీ అంటూ హెల్తీ స్టెప్స్‌ వేయిస్తే...వేయిస్తామంటే...ఇక ఆ సందడికి హద్దుంటుందా? అందుకే సిటీలోని ఫిట్‌నెస్‌ లవర్స్‌ ఉర్రూతలూగారు. మాదాపూర్‌లోని ఫినిక్స్‌ ఎరీనాలో నిర్వహించిన ఈ ఈవెంట్‌కి పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు సైతం హాజరయ్యారు. ఆనందంగా ఆరోగ్యతాండవం చేశారు. పరోక్షంగా అసహాయులకు ఆసరా అందించారు.  

గొప్ప‘సాయం’కాలం..
తామెన్నో ఫిట్‌నెస్‌ ఈవెంట్స్‌ నిర్వహించినప్పటికీ ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి దాకా జరిగిన జుంబా నృత్య కార్యక్రమం చాలా విభిన్నమైందని జిన్‌ నిర్వాహకురాలు చాను చెప్పారు. దీని ద్వారా ఎందరో చిన్నారులకు, అవసరార్ధులకు కొంతైనా సాయం చేయగలిగినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ ఈవెంట్‌ ద్వారా వసూలైన మొత్తాన్ని సోమవారమే చైతన్య మహిళా మండలి నిర్వాహకులకు అందజేసినట్టు వివరించారు. ఈ తరహాలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ ఈవెంట్‌ విజయం స్ఫూర్తిని అందించిందన్నారు.  

అనాథలూ..అన్యాయానికి గురైనవాళ్లూ..
గత 15 సంవత్సరాలుగా చైతన్య మహిళా మండలి (సీఎంఎం) ఆధ్వర్యంలో హ్యూమన్‌ ట్రాఫికర్స్‌ బారిన పడిన మహిళలను, చిన్నారులను రక్షించి ఆశ్రయం అందిస్తోంది. వీరికి నీడనివ్వడంతో పాటు ట్రౌమా కౌన్సిలింగ్, నాణ్యమైన విద్య, వైద్య సేవలు, పోషకాహారం, సైకాలజిస్ట్‌ సేవలు అన్నీ అందిస్తోంది. ఇక్కడ 42 మంది బాలికలు మంచి విద్యను అందుకుంటున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు, అలాగే బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపబడిన మహిళల పిల్లలను కూడా ఈ సంస్థ చేరదీసి వారు నరక కూపంలో ఇరుక్కోకుండా తగిన పోషణ అందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement