ఫ్లైఓవర్‌పై రయ్‌ రయ్‌

First Level Flyover Started By KTR At Biodiversity - Sakshi

ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

ప్రయాణం సాఫీ.. సమయం ఆదా

గచ్చిబౌలి: గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ జంక్షన్‌లో ఫస్ట్‌లెవల్‌ ఫ్లైఓవర్‌పై వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. గురువారం దీనిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి  మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. రూ.30.26 కోట్ల వ్యయం తో 690 మీటర్ల పొడవు, 11.50 మీటర్ల వెడల్పు (వన్‌వే)తో నిర్మించిన ఈ ఫస్ట్‌లెవల్‌ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం, ఇనార్బిట్‌ మాల్‌ వైపు వెళ్లే వాహనదారుల ప్రయాణం సాఫీగా సాగనుంది. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్, సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్, మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావు, జీహెచ్‌ఎంసీ సీఈ జియావుద్దీన్, వెస్ట్‌ జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్‌ వెంకన్న, ప్రాజెక్ట్స్‌ ఈఈ వెంకటరమణ పాల్గొన్నారు. 

ట్రాఫిక్‌ చిక్కులు వీడినట్లే.. 
► బయోడైవర్సిటీ జంక్షన్‌లో రెండు వంతెనలు అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్‌ చిక్కులు వీడినట్టే. మెహిదీపట్నం, ఫిలింనగర్, మణికొండ వైపు నుంచి వచ్చే వాహనదారులు లెవల్‌–2 ఫ్లైఓవర్‌ పై నుంచి ఐకియా మీదుగా మైండ్‌స్పేస్‌ అండర్‌పాస్‌ ద్వారా మాదాపూర్‌ ఐటీ కంపెనీలు, సైబర్‌టవర్‌ వైపు ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్తున్నారు. 
► ఫస్ట్‌ లెవల్‌ వంతెన అందుబాటులోకి రావడంతో లింగంపల్లి, కొండాపూర్, ఓఆర్‌ఆర్‌ నుంచి వచ్చే వాహనాలు సిగ్నల్‌ సమస్య లేకుండా మెహిదీపట్నం, ఇనార్బిట్‌ మాల్‌వైపు వెళ్లవచ్చు. 
► లింగంపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలు ఖాజాగూడ క్రాస్‌రోడ్డు వరకు రావాలంటే దాదాపు 20 నిమిషాలు పట్టేది. ఇప్పుడు గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ ఫస్ట్‌లెవల్‌ ఫ్లైఓవర్‌పై నుంచి 8 – 10 నిమిషాల్లోనే వెళ్లవచ్చు. దీనివల్ల దాదాపు 10 నిమిషాల సమయం ఆదా కానుంది.  
► గచ్చిబౌలి జంక్షన్‌ నుంచి ఇనార్బిట్‌ మాల్‌కు వెళ్లాలన్నా 20 నిమిషాలు పట్టేది. ఫస్ట్‌లెవల్‌ వంతెన, నాలెడ్జ్‌సిటీ లింక్‌రోడ్డు కూడా అందుబాటులోకి రావడంతో ఇప్పు డు 10 నిమిషాల్లోనే చేరవచ్చు. తద్వారా ఇనార్బిట్‌ మాల్‌ వైపు వెళ్లే వాహనదారులకు 10 నిమిషాలు ఆదా కానుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top