కన్నీళ్లే మిగిలాయి..

Farmers Loss With Draught - Sakshi

అడుగంటిపోతున్న భూగర్భజలాలు  నీరందక

ఎండిపోతున్న  వరి పంట

కందుకూరు(మహేశ్వరం): భూగర్భ జలాలు అడుగంటి సాగు చేసిన పంటలు కళ్లెదుటే ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. దీంతో పశువులకు మేతగా వేయడం లేదా దున్నేయడమో చేస్తున్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఈఏడాది వరి సాగు చేసిన రైతన్నలు ఎదుర్కొంటున్న అతి తీవ్రమైన సమస్య. ప్రస్తుతం 24 గంటల విద్యుత్‌తోనే భూగర్భ జలాలు అడుగంటాయని, 12 గంటలు పగటి పూట సరఫరా చేస్తే ఈ సమస్య వచ్చేది కాదని కొంతమంది రైతులు పేర్కొంటున్నారు.

నేదునూరుకు చెందిన రైతు సాటు మల్లయ్య తనకున్న రెండు ఎకరాల భూమి అందులో ఒక బోరు ఉంది. కాగా రబీలో అర ఎకరంలో వరి సాగు చేశాడు. తీరా పంట చేతికొచ్చే దశలో భూగర్భ జలాలు అడుగంటి బోరు ఎండిపోయింది.  
కొత్తగూడకు చెందిన అన్నదమ్ములు బాల్‌రాజ్, శంకర్‌ గ్రామ సమీపంలో ఉన్న ఎకరన్నర భూమిలో రబీ సీజన్‌లో వరి సాగు చేపట్టారు. వారికున్న మూడు బోర్లలో ప్రస్తుతం ఒకే బోరు నడుస్తుంది. అందులో సైతం భూగర్భజలాలు పడిపోయాయి. దీంతో తొలుత అర ఎకరంలో వరి ఎండిపోగా పశువుల మేతకు వదిలేశారు. దీంతో ఏం చేయాలో తెలియక  రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పశుపోషణపై ఆధారపడి నెట్టుకొస్తున్నారు. అదే గ్రామానికి చెందిన సౌడపు శంకర్‌ సాగు చేసిన వరి పంట పూర్తిగా ఎండిపోవడంతో నష్టపోయాడు. ఇలా మండల వ్యాప్తంగా పలువురు రైతులు రబీలో వరి సాగు చేసి తీవ్రంగా నష్టపోయారు.  

24 గంటల కరెంట్‌తోనే...
24 గంటల విద్యుత్‌తో నిరంతరాయంగా బోర్లు నడవడంతో నీటి మట్టాలు పడిపోయాయి. దీంతో పంటలకు నీరు అందించలేకపోతున్నాం. పగటిపూట విద్యుత్‌ ఇస్తే ఇంత నష్టం ఉండేది కాదు. ఎకరన్నరలో సాగు చేసిన వరి పంటను ఇప్పటికే సగం పశువులకు మేపాం. ఇప్పుడు మిగతా పంట ఎండిపోతుంది. చాలా నష్టపోయాం. ప్రభుత్వం ఆదుకోవాలి.    – బాల్‌రాజ్, రైతు, కొత్తగూడ  

తొమ్మిది గంటలు సరిపోతుంది
పగటి పూట 9 గంటలు విద్యుత్‌ ఇస్తే సరిపోతుంది. 24 గంటలు ఇవ్వడంతో నిరంతరాయంగా బోర్లను ఆన్‌ చేసి ఉంచడంతో భూగర్భ జలాల మట్టం వేగంగా పడిపోయి పంటలకు నీరు అందడంలేదు. దీంతో కొద్ది విస్తీర్ణంలో సాగు చేసిన పంటలు ఎండిపోయి నష్టపోతున్నాం. ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించాలి. – సురేందర్‌రెడ్డి, రైతు, నేదునూరు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top