మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తున్న విద్యార్థినులు
రోడ్డెక్కిన గురుకుల కళాశాల విద్యార్థినులు
చేయిచేసుకున్న మహిళా కానిస్టేబుల్‌ను చితకబాదిన స్టూడెంట్స్
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఉద్రిక్తత
షాద్‌నగర్: ‘అడుగడుగునా వేధిస్తోంది.. లంచాలు అడుగుతోంది.. కులం పేరుతో దూషిస్తోంది.. మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.. ఈ ప్రిన్సిపాల్ మా కొద్దు.. ఆమె నుంచి విముక్తి కల్పించండి’ అంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని కమ్మదనం గ్రామ శివారులో నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో నాగర్‌కర్నూల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల కొనసాగుతోంది. ఇక్కడ సుమారు 600 మంది విద్యార్థినులు విద్యాభ్యాసం సాగిస్తున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ శైలజ తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపిస్తూ ఆదివారం విద్యార్థినులు ప్లకార్డులు పట్టుకొని పెద్దసంఖ్యలో హాస్టల్ నుంచి బయటికి వచ్చారు. సుమారు రెండున్నర కిలోమీటర్లకు పైగా ర్యాలీగా వెళ్లి షాద్‌నగర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు.
వీరి ఆందోళనకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మద్దతు తెలిపారు. ఓ దశలో విద్యార్థినులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు విద్యార్థినులు సొమ్మసిల్లి కింద పడిపోయారు. మఫ్టీలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ విద్యార్థినులను బలవంతంగా వాహనంలో ఎక్కించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఓ విద్యార్థినిని చెంపపై కొట్టడంతో అంతా ఆగ్రహంతో ఆమెను జుట్టుపట్టి కొద్దిదూరం ఈడ్చుకెళ్లి చితకబాదారు.
పట్టణ సీఐ విజయ్‌కుమార్ విద్యార్థినులకు నచ్చజెప్పి పోలీస్‌స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. త్వరలో కమిటీ వేసి సమస్యను పరిష్కరిస్తామని జోనల్ ఆఫీసర్ నిర్మల చెప్పినా వారు వినలేదు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాల్సిందేనని, అప్పటివరకు హాస్టల్‌కు వెళ్లబోమని భీష్మించుకుని ఠాణా ఎదుటే కాసేపు బైఠాయించారు. తిరిగి చౌరస్తా వద్దకు వచ్చి ధర్నా చేపట్టారు. పోలీసులు మరోసారి వారికి సర్దిచెప్పి బస్సుల్లో హాస్టల్‌కు పంపించారు.


