భద్రాచలంలో దరఖాస్తు పూర్తి చేస్తున్న ఏఈఓ సత్యనారాయణ
సూపర్‌బజార్(కొత్తగూడెం) : రైతుల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతులకు ప్రభుత్వమే బీమా చేయించి, వారు ఏ కారణంతో మరణించినా.. కుటుంబానికి బీమా ప్రీమియం రూ.5 లక్షలు వచ్చేలా చర్యలు చేపట్టింది.
జిల్లాలో 81,765 మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించింది. జిల్లాలో అనధికారిక లెక్కల ప్రకారం మొత్తం 3.50 లక్షల మంది రైతులు ఉన్నప్పటికీ ప్రభుత్వం 1.07 లక్షల మందికి మాత్రమే పట్టాదారు పాస్‌పుస్తకాలను అందించింది. వీరిలో 18 - 59 సంవత్సరాల మధ్య వయసు వారిని ఈ పథకానికి అర్హులుగా గుర్తించింది.
1959 ఆగస్టు 14 - 2000 ఆగస్టు 15 మధ్య జన్మించిన వారికి మాత్రమే రైతుబీమా వర్తింపజేయాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలో 81,765 మందికి అర్హత లభించింది. ఒక్కో రైతుకు బీమా ప్రీమియంగా సంవత్సరానికి రూ.2, 271.50 ప్రభుత్వమే చెల్లిస్తుంది.
ఆగస్టు 15 నుంచి తిరిగి ఆగస్టు 14 వరకు ప్రతి సంవత్సరం ఈ పథకం అమలులో ఉంటుంది. ప్రతి రైతు బీమా అమలుకు రెండు దరఖాస్తులు పూర్తిచేయాలి. బీమా అమలు చేసే ఎల్‌ఐసీ వారి కోసం ఇంగ్లిష్‌లో, వ్యవసాయ శాఖ కోసం తెలుగులో దరఖాస్తులు నింపాలి.
దరఖాస్తులు మొత్తం పూర్తిచేసి అనుసంధానం తరువాత అగస్టు 15 వరకు ఎల్‌ఐసీ సంస్థ రైతుబంధు జీవిత బీమా బాండ్లను సిద్ధం చేయనుంది. దరఖాస్తులు పూర్తి చేసేప్పుడు ప్రతిరైతు నామినీ పేరు తప్పకుండా పేర్కొనాలి. మరణించిన రైతు కుటుంబానికి 10 రోజుల లోగా రూ.5 లక్షల బీమాను వర్తింపజేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
కాగా ప్రస్తుతం ప్రభుత్వం నుంచి 30 వేల దరఖాస్తులు జిల్లాకు చేరుకున్నాయి. రైతుబీమా పథకం దరఖాస్తు బాధ్యతలను ఏఈవోలకు అప్పగించడంతో వారు రైతుల ఇళ్లకు వెళ్లి మరీ దరఖాస్తులను పూర్తి చేస్తున్నారు. ఇప్పటివరకు 3,170 దరఖాస్తులను పూర్తి చేశారు. మిగిలిన దరఖాస్తులను త్వరలోనే పూర్తిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లు వ్యవసాయ శాఖాధికారులు చెపుతున్నారు.


