అప్పులబాధతో రైతు ఆత్మహత్య | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో రైతు ఆత్మహత్య

Sep 3 2015 4:07 PM | Updated on Nov 6 2018 7:56 PM

తనకున్న రెండెకరాల భూమిని సాగులోకి తేవాలని అప్పు చేసి రెండు బోర్లు వేసినా చుక్క నీరు పడకపోగా.. ఆరుతడి పంటలు వేసైనా బోర్ల కోసం తెచ్చిన అప్పు తీర్చాలనుకున్న ఆ రైతుకు కాలం కలిసి రాకపోవడంతో చావే శరణ్యమైంది.

కొల్చారం (నల్గొండ జిల్లా) : తనకున్న రెండెకరాల భూమిని సాగులోకి తేవాలని అప్పు చేసి రెండు బోర్లు వేసినా చుక్క నీరు పడకపోగా.. ఆరుతడి పంటలు వేసైనా బోర్ల కోసం తెచ్చిన అప్పు తీర్చాలనుకున్న ఆ రైతుకు కాలం కలిసి రాకపోవడంతో చావే శరణ్యమైంది. దీంతో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించాడు. ఈ ఘటన కొల్చారం మండలం సంగాయిపేట గిరిజన తండాలో గురువారం వెలుగుచూసింది. బాధిత కుటుంబీకుని భార్య చెమ్లి, తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం... తండాకు చెందిన రైతు లంబాడి విఠల్(46) తండాకు సమీపంలో రెండెకరాల పొలం ఉంది. కొన్నేళ్ళుగా వర్షాధారంతోనే పంట సాగు చేస్తూ వచ్చాడు. కాగా గత రెండేళ్ళుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో భూమి బీడుగా ఉంటూ  వచ్చింది. దీంతో ఎలాగైనా భూమిని సాగులోకి తేవాలనుకున్న విఠల్ బ్యాంక్ ద్వారా, ఇతర ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పుగా డబ్బులు తీసుకువచ్చి రెండు బోర్లు వేసినట్లు తెలిపారు. బోర్లు వేసినా నీరు పడకపోవడంతో అటు సాగులోకి భూమి రాక తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కనిపించకుండాపోయింది.

మరోవైపు రుణమాఫీకి సంబంధించిన డబ్బుల కోసం గత రెండు రోజుల నుంచి స్థానిక రంగంపేట ఎస్‌బిహెచ్ బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ బ్యాంక్ రుణం పూర్తిగా రెన్యువల్ చేస్తే మాఫీ డబ్బులు ఇస్తామని చెప్పడంతో విఠల్ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది. ఆరుతడి పంటకింద వేసిన మొక్కజొన్న సైతం వర్షాలు కురవక ఎండుముఖం  పడుతుండడంతో ఇక అప్పులు తీర్చేమార్గం కనిపించకపోవడంతో గత కొన్ని రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం 5గంటల ప్రాంతంలో పొలం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి పొలానికి కొద్ది దూరంలో వేపచెట్టుకు ఉరివేసుకున్నాడు. విఠల్‌కు దాదాపు 3లక్షల వరకు బ్యాంక్, ప్రైవేటు అప్పులు ఉన్నట్లు తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబీకులు కొల్చారం పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు విఠల్‌కు ఇద్దరు కుమారులు శ్రీను, కిషన్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement