‘పర్యవేక్షణ’ ఎవరికి?  | Education department works out on posts replacement | Sakshi
Sakshi News home page

‘పర్యవేక్షణ’ ఎవరికి? 

Dec 25 2017 2:31 AM | Updated on Aug 15 2018 7:59 PM

Education department works out on posts replacement - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాల విద్యా శాఖలో పర్యవేక్షణ అధికారి పోస్టుల్లో పదోన్నతుల గందరగోళం మొదలైంది. మండల విద్యాధికారి (ఎంఈవో), ఉప విద్యాధికారి (డిప్యూటీ ఈవో), డైట్‌ లెక్చరర్, బీఎడ్‌ కాలేజీ లెక్చరర్‌ వంటి పోస్టుల్లో పదోన్నతులను ఎవరికి కల్పించాలన్న విషయంలో విద్యా శాఖ తర్జన భర్జన పడుతోంది. ఎంఈవో మినహా మిగతా పోస్టులను తమకే ఇవ్వాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు మొదటి నుంచి డిమాండ్‌ చేస్తుండగా.. ఏకీకృత సర్వీసు రూల్స్‌కు రాష్ట్రపతి ఆమోదం లభించినందున, త్వరగా కోర్టులో ఉన్న కేసును పరిష్కరించి అందరికీ కలిపి పదోన్నతులు ఇవ్వాలని జిల్లా పరిషత్‌ టీచర్లు కోరుతున్నారు. మరోవైపు తాము జోనల్‌ కేడర్‌ టీచర్లుగానే నియమితులయ్యామని, జోనల్‌ కేడర్‌లోని పర్యవేక్షణ అధికారి పోస్టుల్లో తమకే పదోన్నతులు కల్పించాలని స్కూల్‌ అసిస్టెంట్లు ఆందోళనకు సిద్ధమయ్యారు.

జోనల్‌ కేడర్‌లో నియమితులైన తమకు అదే కేడర్‌లోని పాఠశాలల పర్యవేక్షణ అధికారి పోస్టుల్లో ఎందుకు పదోన్నతులు కల్పించడం లేదని ప్రశ్నిస్తున్నారు. తమ పదోన్నతులకు సర్వీసు రూల్స్‌తో సంబంధమే లేదని, అయినా తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ కిషన్‌ను కలసి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీరు 1997లో జోనల్‌ కేడర్‌లోనే నియమితులయ్యారా? లేదా? అన్న వివరాలను విద్యా శాఖ ఏపీపీఎస్సీ నుంచి నివేదిక తెప్పించుకుంది. 1997లో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను జోనల్‌ కేడర్‌లోనే భర్తీ చేసినట్లు ఏపీపీఎస్సీ తమ నివేదికలో పేర్కొంది. దీంతో పర్యవేక్షణ అధికారి పోస్టులకు ఎవరితో భర్తీ చేయాలన్న గందరగోళంలో విద్యా శాఖ పడింది. మరోవైపు ఇప్పటికే పంచాయతీరాజ్‌ టీచర్లు, ప్రభుత్వ టీచర్లు, జోనల్‌ కేడర్‌ టీచర్లు డిమాండ్‌ చేస్తుండగా, తాము ఎప్పుడో లోకల్‌ కేడర్‌ ఆర్గనైజ్‌గా ఉన్నందున తమకూ పదోన్నతులు కల్పించాలని గిరిజన టీచర్లు డిమాండ్‌ చేస్తున్నారు.  

అసలైన అర్హులెవరు? 
నాలుగు రకాల సంఘాలు, ఉపాధ్యాయులు పర్యవేక్షణ అధికారి పోస్టుల్లో పదోన్నతులపై డిమాండ్‌ చేస్తుండగా.. పదోన్నతులు పొందేందుకు అసలైన అర్హులెవరు అన్న అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వం వివిధ కోణాల్లో పరిశీలన జరుపుతోంది. ఏకీకృత సర్వీసు రూల్స్‌ రూపకల్పనకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో పంచాయ తీరాజ్‌ టీచర్లలో ఎక్కువ మందికి పదోన్నతులు లభిస్తాయని ఆనందపడ్డారు. ఈలోగా రాష్ట్రపతి ఏకీకృత సర్వీసు రూల్స్‌కు ఎలా ఆమోదం తెలుపుతారంటూ ప్రభుత్వ టీచర్ల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కేసు విచారణకు తీసుకుంది. కొద్ది రోజుల్లో ఆ వివాదం పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో.. ఈలోగా రూల్స్‌ను సిద్ధం చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే పలు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement