మందు బాబులకు వాట్సాప్‌ సాయం! | Drunk Drivers Use WhatsApp To Escape Check Points In Hyderabad | Sakshi
Sakshi News home page

మందు బాబులకు వాట్సాప్‌ సాయం!

Jul 25 2019 9:06 AM | Updated on Jul 25 2019 9:06 AM

Drunk Drivers Use WhatsApp To Escape Check Points In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌ : డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ల నుంచి తప్పించుకోవడానికి మందుబాబులు సరికొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. బ్రీత్‌ ఎనలైజర్‌ బారీన పడకుండా ఉండేదుకు తమ బుర్రలకు పదును పెడుతున్నారు. మొన్నటివరకు కొందరు మందుబాబులు బ్రీత్‌ ఎనలైజర్‌ తమను గుర్తించకుండా ఉండేందుకు మద్యం సేవించిన అనంతరం నిమ్మరసం, కొత్తిమీర రసం తాగి రోడ్లపైకి ఎక్కేవారు. కానీ అది అంతగా ఫలితం చూపించలేకపోయింది. అయితే ఇక్కడే మరికొందరు మందుబాబులు ఈ టెస్ట్‌ల నుంచి తప్పించుకోవడానికి టెక్నాలజీని వాడుకోవాలని డిసైడ్‌ అయ్యారు. పలు పబ్‌లలో, రెస్టారెంట్‌లలో మద్యం సేవించే వాళ్లంతా కలిసి సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాం వాట్సాప్‌లో గ్రూపులు క్రియేట్‌ చేశారు. చాలా మంది ఒక్క గ్రూపులోనే కాకుండా నాలుగైదు గ్రూపుల్లో సభ్యులుగా చేరుతున్నారు. ఈ గ్రూపులు ముఖ్య ఉద్దేశం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు ఎక్కడ జరుగుతున్నాయనే విషయాన్ని అందులోని సభ్యులకు తెలియజేయడమే.

ఎలాగంటే..  ఎవరైనా వెళ్తున్న రూట్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ అండ్‌ టెస్ట్‌లు జరిగితే.. వారు ఆ విషయాన్ని సదురు గ్రూప్‌ల్లో పోస్ట్‌ చేస్తారు. దీంతో మిగతా వాళ్ల అంతా అలర్ట్‌ అవుతారు. ఆ రూట్‌లో వెళ్లకుండా ఇతర మార్గాల్లో వెళ్లేందుకు సిద్ధమవుతారు. మరికొందరైతే మద్యం సేవించి బయలుదేరే ముందు తాను వెళ్తున్న రూట్‌లో ట్రాఫిక్‌ ఎలా ఉందో గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా పరిశీలిస్తున్నారు. ఆ మార్గంలో ఎదో ఒక నిర్దేశిత ప్రాంతంలో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్నట్టు మ్యాప్‌లో చూపిస్తే.. అక్కడ ఏమైనా తనిఖీలు జరుగుతున్నాయో లేదో తెలుసుకోవడాని వాట్సాప్‌ గ్రూప్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇలా పదుల సంఖ్యలో వాట్సాప్‌ గ్రూప్‌లు ఉండటం.. అందులో వేల సంఖ్యలో సభ్యులు ఉండటంతో ఎక్కడ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌లు జరిగినా సమాచారం అనేది మిగతా సభ్యులకు వేగంగా చేరుతుంది. కొంతమంది ఈ విధానాన్ని చాలా కాలం నుంచే ఫాలో అవుతున్నప్పటికీ.. ఇటీవల కాలంలో ఈ సంఖ్య అమాంతం పెరిగింది. ప్రస్తుతం బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, గచ్చిబౌలి, మెహిదీపట్నం, బేగంపేటలలోని పబ్‌లలో మద్యం సేవించే పలువురు ఈ వాట్సాప్‌ గ్రూప్‌లలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ ప్రాంతాల్లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌లు ఎక్కువగా జరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 

మరోవైపు మద్యం సేవించి వాహనాలు నడపటం ద్వారా ఎంతో మంది ప్రమాదాల బారీన పడుతున్న సంగతి తెలిసిందే. మద్యం సేవించడం యువతకు కిక్కు ఇస్తున్నప్పటికీ.. తాగి వాహనాలు నడపడం అనార్థాలకు దారి తీస్తుంది. వారి కుంటుబాల్లో విషాదాన్ని నింపుతోంది. ఈ ఏడాదిలో జూన్‌ వరకు దాదాపు 15 వేల డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేసినట్టు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement