మున్నేరు.. ఏదీ నీరు?

Drinking Water Problem Tribals Warangal - Sakshi

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ మునిసిపాలిటీ పరిధిలోని శివారు కాలనీల ప్రజలను తాగునీటి సమస్య వెంటాడుతోంది. ప్రధానంగా వినాయక తండా, పత్తిపాక కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఐదు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు నీటి సమస్యతో అల్లాడుతున్నారు. కనీసం మున్నేరువాగు నీరు కూడా సరఫరా కావడం లేదు. మిషన్‌ భగీరథకు సంబంధించిన నీటి సరఫరా జరగడానికి ఇన్‌ట్రా విలేజీ పనులు కూడా పూర్తి కాలేదు. దీంతో సరఫరా కావడానికి చాలా సమయం పడే పరిస్థితి కనిపిస్తోంది.

అడుగంటిన చేతి పంపులు
జిల్లా కేంద్రం శివారు వినాయక తండాలో సుమారు 50 గృహాలు ఉండగా 250 మంది జనాభా, 120 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఆ తండా వాసుల నీటి అవసరాలు తీర్చేందుకు రెండు చేతి పంపులు వేయగా.. అందులో పూర్తిస్థాయిలో నీరు లేక అవి పెద్దగా ఉపయోగ పడడం లేదు. ఇక పత్తిపాక కాలనీలో 250 గృహాలు ఉండగా 800 ఓటర్లు, 1100 మంది జనాభా నివాసం ఉంటున్నారు. ఈ కాలనీలో మూడు చేతి పంపులు ఉండగా ఒకటి పని చేయడం లేదు. మరో చేతి పంపులో అరకొర నీరే ఉంది. కేవలం ఒకే ఒక చేతి పంపు ద్వారా మాత్రమే నీరు వస్తోంది.

ఒక్క చేతి పంపే ఆధారం
వినాయక తండా, పత్తిపాక కలిపి ఒకే చేతి పంపు ఆధారంగా మారింది. పత్తిపాకలో ఉన్న ఈ చేతి పంపులో మాత్రమే నీరు సమృద్ధిగా ఉంది. దీంతో అక్కడికే వినాయక తండా, పత్తిపాక కాలనీవాసులు వచ్చి బిందెలతో నీరు తీసుకెళ్తున్నారు. కొంత మంది తోపుడు బండ్లతో, మరికొందరు సైకిళ్లు, బైక్‌లపై నీరు తీసుకెళ్తున్నారు. ఆ నీరే తాగడానికి, వాడుకోవడానికి ఉపయోగిస్తున్నారు.

దశాబ్దాలు గడిచినా...
వినాయక తండా, పత్తిపాక కాలనీలు ఏర్పాటై ఐదు దశాబ్దాలు గడిచినా ప్రతీ వేసవిలో తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. మానుకోట శివారులోని మున్నేరువాగు నీటిని కూడా ఈ ప్రాంతాలకు ఇంత వరకు అందించలేదు. అందుకోసం కనీసం పైపులైను కూడా ఏర్పాటు చేయలేదు. ఇక మిషన్‌ భగీరథకు సంబంధించిన ఇన్‌ట్రా విలేజ్‌ పనులు ఆ ప్రాంతాల్లో ప్రారంభం కాలేదు. ఇంకా ఆరు నెలలైనా పైపులైను పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

నల్లాల బావి నీటి సరఫరా..
పత్తిపాక శివారులోని నల్లాల బావి నుంచి మునిసిపల్‌ సిబ్బంది నీరు సరఫరా చేస్తున్నారు. ఆ బావిలో కూడా నీరు అడుగంటడంతో మూడు రోజులకోసారి ఇంటికి 10 బిందెల చొప్పున మాత్రమే నీటి సరఫరా చేస్తున్నారు. ఆ బావిలోనూ ఫ్లోరైడ్‌ ఉండటంతో వాటిని తాగడానికి వీలు కావడం లేదు. గతంలోనూ ఆ నీటిని తాగిన కొందరు ఫ్లోరోసిస్‌ వ్యాధి బారిన పడ్డారు. ఇప్పటికైనా కాలనీలకు శాశ్వత పైపులైను నిర్మాణం చేసి మిషన్‌ భగీరథ నీరు సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు.
 

నీటి కోసం ఇబ్బంది పడుతున్నాం 
గత కొన్ని సంవత్సరాలుగా తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నాం. పత్తిపాకలోని చేతి పంపే అందరికీ దిక్కయింది. అధికారులకు పలుమార్లు తెలియజేసినా ఫలితం లేదు. వేసవి కాలంలో నీటి సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. – తోళ్ల అరుణ, పత్తిపాక కాలనీ వాసి

ట్యాంకుల ద్వారా అయినా సరఫరా లేదు
నీటి కోసం ఇబ్బంది పడుతున్నా కనీసం మునిసిపాలిటీ అధి కారులు ట్యాంకుల ద్వారా అయినా నీటి సరఫరా చేయడం లేదు. మూడు చేతి పంపుల్లో అరకొర నీరు మాత్రమే ఉంది. దీంతో వినాయక తండా, పత్తిపాక కాలనీవాసులమంతా పత్తిపాక చేతి పంపు వద్దకే వస్తున్నాం. – జి.తార, పత్తిపాక కాలనీవాసి

మూడు రోజులకోసారి నీటి సరఫరా
నల్లాల బావి నుంచి మూడు రోజులకోసారి నీటి సరఫరా చేస్తున్నారు. కేవలం 10 బిందెల నీరు మాత్రమే సరఫరా చేస్తున్నారు. బావిలో నీరు అడుగంటింది. ఆ బావిలోనూ ఫ్లోరైడ్‌ ఎక్కువగా ఉంది. ఆ నీటిని తాగడానికి ఉపయోగించడం లేదు.– సోమారపు నాగమణి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top