ముంచెత్తిన మురుగు

Drainage Water Filled in Gandhi Hospital Seller - Sakshi

‘గాంధీ’ సెల్లార్‌లో మురుగు నీటి వరద

చిన్నాభిన్నమైన ఆస్పత్రి డ్రైనేజీ వ్యవస్థ  

దుర్గధంలోనే ఫిజియోథెరపీ సేవలు  

గాంధీఆస్పత్రి : డ్రైనేజీ వ్యవస్థలో ఏర్పడిన లోపం సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి సెల్లార్‌ను మురుగునీరు ముంచెత్తింది. ఆస్పత్రి ప్రధాన భవనం సెల్లార్‌లో నిర్వహిస్తున్న మెడికల్‌ స్టోర్, సర్జికల్‌ స్టోర్‌ (సీఎస్‌డీ), టెలిఫోన్‌ ఎక్సేంజ్, ఫిజియోథెరపీ, డైట్‌ క్యాంటిన్‌ తదితర విభాగాల్లోకి గురువారం ఉదయం భారీగా మురుగునీరు చేరడంతో రోగులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  పద్మారావునగర్‌ వైపు ఉన్న డ్రైనేజీ లైన్‌ మూసుకుపోవడంతో ఆస్పత్రి నుంచి బయటికి వెళ్లాల్సిన మురుగునీరు వెనక్కు వచ్చి సెల్లార్‌ను ముంచెత్తినట్లు గుర్తించిన ఆస్పత్రి పాలనా యంత్రాంగం సమస్యను పరిష్కరించేందుకు తాత్కాలిక చర్యలు చేపట్టింది. వివరాల్లోకి వెళితే..గాంధీ ఆస్పత్రికి చెందిన మురుగునీరు ప్రత్యేక పైప్‌లైన్ల ద్వారా పద్మారావునగర్‌ వైçపుగల  జీహెచ్‌ఎంసీ డ్రైనేజీలో కలుస్తుంది. జీహెచ్‌ఎంసీ డ్రైనేజీ ఓవర్‌ఫ్లో కావడంతో ఆస్పత్రికి చెందిన డ్రైనేజీ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. దీంతో మురుగునీరు బయటికి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో సెల్లార్‌ను ముంచెత్తింది. 

సిబ్బంది, రోగులకు అస్వస్తత....
ఆస్పత్రి సెల్లార్‌లో ఫిజియోధెరపీ ఇన్‌పేషెంట్‌ విభాగాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం మురుగునీరు ముంచెత్తడంతో అక్కడ వైద్యసేవలు అందిస్తున్న సిబ్బంది, రోగులుదుర్వాసన భరించలేక వాంతులు చేసుకున్నారు. దీంతోకొన్ని వైద్యయంత్రాలను ఓపీ విభాగంలోకితరలించి అక్కడే వైద్యసేవలు కొసాగించారు. 

అధునాతన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు  రూ. 3 కోట్లతో ప్రతిపాదనలు...  
15 ఏళ్ల క్రితం నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ పాడైపోవడం, పెరిగిన రోగులు, వైద్యులు, సిబ్బందికి అవసరాలకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రూ. 3 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.  నిధులు మంజూరు కాకపోవడంతో నిర్మాణపనులు ప్రారంభం కాలేదు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ నిర్వహించిన  సమీక్ష సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ సమస్యను ఆయన దృష్టికి తెచ్చారు. సమస్యను పరిష్కరించేందుకు ముంబైకి చెందిన నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించి నూతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆ తర్వాత రెండురోజులకే ఆస్పత్రి డ్రైనేజీ వ్యవస్థ కుప్పకూలడం గమనార్హం. సమస్యను గుర్తించామని మురుగునీరు సెల్లార్‌ను ముంచెత్తకుండా తాత్కాలిక చర్యలు చేపట్టామని ఆస్పత్రి ఆర్‌ఎంఓ–1 జయకృష్ణ తెలిపారు. తక్షణమే ప్రభుత్వంతోపాటు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ఆస్పత్రి అధికారులు, వైద్యులు, సిబ్బందితోపాటు రోగులు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top