పంచని పుస్తకాల్లో తప్పులెన్నో!

Discontinued 3 lakh pass books before the delivery - Sakshi

పంపిణీకి ముందే 3 లక్షల పాస్‌ పుస్తకాల నిలిపివేత

సాక్షి, హైదరాబాద్‌: కొత్త పాస్‌ పుస్తకాల పంపిణీ తప్పుల తడకని తేలిపోయింది. ముద్రణ సమయంలోనే 3 లక్షల పాస్‌ పుస్తకాల్లో తప్పులున్నాయని గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం.. వాటిని పంపిణీ చేయకుండా నిలిపివేయడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పేరు తప్పుల నుంచి ఆధార్‌ నంబర్ల వరకు, విస్తీర్ణంతోపాటు ఫొటోలు కూడా తప్పులు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పుస్తకాలను పంపిణీ చేయలేదు. ఇది ఒక ఎత్తయితే పంపిణీ చేసిన పుస్తకాల్లో కూడా అదే స్థాయిలో తప్పులు వస్తుండటం మరింత గందరగోళానికి దారితీస్తోంది. అయితే పాస్‌ పుస్తకాల్లో తప్పులకు క్షేత్రస్థాయిలో జరిగిన నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. అడ్డగోలుగా రికార్డులు సరిచేయడం, ఎలాంటి పరిశీలన లేకుండా ఇష్టారాజ్యంగా పాస్‌ పుస్తకాల వివరాలను ముద్రణకు పంపడమే ఇంతటి గందరగోళానికి కారణమైందని రెవెన్యూ ఉన్నతాధికారులు నిర్ధారించుకున్నారు. దీంతో ఇప్పుడు ఆ పుస్తకాలన్నింటినీ మళ్లీ ముద్రించేందుకు సిద్ధమయ్యారు. 

14 రకాల తప్పులు 
పంపిణీ చేయకుండా నిలిపివేసిన పుస్తకాల్లో మొత్తం 14 రకాల తప్పులున్నాయని అధికారులు గుర్తించారు. ఇందులో రైతుకు అత్యంత కీలకమైన భూమి విస్తీర్ణం నమోదులోనే ఎక్కువ పుస్తకాల్లో తప్పులు వచ్చాయి. మొత్తం 93 వేల పుస్తకాల్లో రైతుకు ఉన్న భూమి కన్నా ఎక్కువో, తక్కువో నమోదయ్యాయి. వీటికితోడు పట్టాదారుకు బదులు వేరొకరి ఫొటో ఉన్న 37 వేలకు పైగా పుస్తకాలను అధికారులు గుర్తించారు. వాటిని నిలిపివేశారు. చనిపోయిన వారి పేర్ల మీద, పాత పట్టాదారుల పేర్లతో, ఆధార్‌ తప్పులతో, పట్టాదారు పేరు, తండ్రి పేర్లలో తప్పులతో వేల సంఖ్యలో పుస్తకాలను ముద్రించారు. నాలా భూములకు, ప్రభుత్వ భూములకు కూడా పాస్‌ పుస్తకాలను సిద్ధం చేశారు. ఒక్కో రైతుకు ఒక ఖాతా ఉండాల్సి ఉండగా, ఒకే ఖాతా నంబర్‌ను ఇద్దరు, ముగ్గురు రైతులకు వచ్చేలా దాదాపు 34 వేల పుస్తకాలు ముద్రించారంటే రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్వే నంబర్లలో తప్పులు, అసైన్డ్‌ భూములకు, అటవీ శాఖతో వివాదాలున్న భూములకు కూడా పాస్‌ పుస్తకాలు ముద్రించడం గమనార్హం. 

పంపిణీ చేసిన వాటిలోనూ.. 
పంపిణీ చేసిన 39 లక్షల పుస్తకాల్లోనూ అదే స్థాయిలో తప్పులు రావడం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. భూ విస్తీర్ణం, పట్టాదారు పేర్లు, ఫొటోలు, ఆధార్‌ నంబర్లలో వచ్చిన తప్పులును రైతులను మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయి. తమకున్న భూమి మొత్తం పుస్తకాల్లో రాకపోవడంతో ఉన్న భూమి ఎటుపోతుందోననే భయం వారిలో వ్యక్తమవుతోంది. చాలా పుస్తకాల్లో కొనుగోలు చేసిన భూములు కూడా ఆనువంశికంగా వచ్చినట్లు నమోదైంది.

ఇవి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెడతాయోననే సందేహాలు క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ తప్పులను సరిచేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. ‘తప్పులను రికార్డు చేసి వెళ్లిపోండి.. మేం కొత్త పుస్తకాలకు పంపిస్తాం. కానీ అవి ఎప్పుడు వస్తాయో చెప్పలేం’అంటూ క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది చెబుతున్న మాటలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. అవినీతి ఆరోపణలు కూడా పాస్‌పుస్తకాల పంపిణీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చొరవ తీసుకుని నిశిత దృష్టితో ఈ అంశాన్ని పరిష్కరించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. 

విషయం సీఎం దృష్టికి 
ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో రాష్ట్రంలో అసలు ఎన్ని కొత్త పాస్‌పుస్తకాలను ముద్రించారు? అందులో పంపిణీ చేసినవి ఎన్ని? పంపిణీ చేయకుండా నిలిపివేసినవి ఎన్ని? పంపిణీ ఎందుకు చేయలేదనే వివరాలను జిల్లాల వారీ గణాంకాలతో రెవెన్యూ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 49.94 లక్షల కొత్త పాస్‌ పుస్తకాలను ముద్రించామని, అందులో 39.47 లక్షల పుస్తకాలను ఈనెల 23 నాటికి పంపిణీ చేశామని, 3.07 లక్షల పుస్తకాల్లో తప్పులున్నందున వాటిని నిలిపివేశామని తెలిపారు. పంపిణీ చేసిన పాస్‌ పుస్తకాల్లోనూ పెద్ద సంఖ్యలో తప్పులు వచ్చాయన్న సమాచారంతో సీఎం కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సరిచేయాలని ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top