ఆ పోస్టులన్నీ నిజాలు కావు

Digital Media Gives Clarity On Social Media Posts - Sakshi

సోషల్‌ మీడియా పోస్టుల్లో వాస్తవాలు ఇవే

రతన్‌ టాటా పేరిట చక్కర్లు కొడుతున్న పోస్టు ఉత్తిదే

కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంపై అవాస్తవ పోస్టులు

సోషల్‌ మీడియా పోస్టులపై డిజిటల్‌ మీడియా వివరణ

సాక్షి, హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రతీ వార్త, సమాచారం నిజం కాదని, ఇతరులతో పంచుకునే ముందు తప్పనిసరిగా రూఢీ చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డిజిటల్‌ మీడియా విభాగం స్పష్టం చేసింది. అసత్య ప్రచారాలు చేసే వారిపై సంబంధిత చట్టాల కింద శిక్ష పడుతుందని హెచ్చరించింది. సామాజిక మాధ్యమాల్లో ఇటీవలి కాలంలో వైరల్‌ అవుతున్న కొన్ని పోస్టుల్లోని వాస్తవాలను ‘ఫ్యాక్ట్‌చెక్‌’వెబ్‌సైట్‌లో వెల్లడించింది.
► కరోనాతో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందన్న కొంతమంది విశ్లేషకుల అంచనాలు తప్పవుతాయని, మానవ స్ఫూర్తి, అంకితభావం ముందు అసాధ్యమనుకున్నవి ఎన్నో గతంలో సుసాధ్యమైనట్టు రతన్‌ టాటా పేరిట సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు చక్కర్లు కొడుతోంది. ఈ మాటలను తాను అనలేదని తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాల్లో రతన్‌ టాటా స్వయంగా వెల్లడించారు.
► ఇటలీలో క్రేన్ల సాయంతో శవాలను ఎత్తి ఓ శ్మశానంలో గుట్టలుగా పోస్తున్నట్లు ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు వైరల్‌ అవుతోంది. ఇది 2013లో విడుదలైన ‘ది ఫ్లూ’అనే సినిమాలోనిది.
► కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయాన్ని కరోనా ఐసోలేషన్‌ వార్డుగా మార్చారని, కొంత మంది ముస్లింలు ఆ గుడిలో చెప్పులేసుకుని తిరుగుతున్నారని చెబుతూ పెట్టిన ఒక పోస్టు ఫేస్‌బుక్‌లో తిరుగుతోంది. అది కాణిపాకం దేవాలయం కాదు. ‘శ్రీ గణేష్‌ సదన్‌’పేరుతో ఉన్న ఒక వసతి గృహాన్ని ఏపీ ప్రభుత్వం క్వారంటైన్‌ కేంద్రంగా మార్చింది.
► వందనా తివారీ అనే డాక్టర్‌ కరోనా పరీక్షలు చేస్తుండగా ఉత్తరప్రదేశ్‌లో ముస్లింల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని చెబుతూ ఒక ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తున్నారు. ఆమె మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక ఫార్మసిస్ట్‌ అని, కరోనా ప్రబలకుండా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నట్టు నిజ నిర్ధారణలో తేలింది. అయితే వందన మెదడులో రక్తస్రావంతో చనిపోయిందని తెలిసింది.
► కరోనా కారణంగా హోటల్స్, రెస్టారెంట్లు, రిసార్ట్స్‌ 2020 అక్టోబర్‌ 15 వరకు మూసివేయాలని కేంద్ర పర్యాటక శాఖ ఆదేశించినట్లుగా చెబుతున్న ఒక సర్క్యులర్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కేంద్ర పర్యాటక శాఖ, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో దీనిని వదంతిగా పేర్కొన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top