6 వేల పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు

6 వేల పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు - Sakshi


- మన టీవీ ద్వారా గ్రూప్-2పై శిక్షణ

- ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి

 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 6 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అక్టోబర్ 14 నుంచి డిజిటల్ క్లాసులు ప్రారంభిస్తున్నట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. డిజిటల్ బోధనకు సంబంధించి విద్యాశాఖ పాఠ్యాంశాలను సిద్ధం చేస్తోందన్నారు. సాఫ్ట్‌నెట్ ద్వారా మన టీవీ ప్రసారాలకు సంబంధించి ఐటీ శాఖతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 90 లక్షల గృహాలకు మన టీవీ ప్రసారాలు చేరడం లక్ష్యంగా ఇస్రోతో ఒప్పం దం కుదుర్చుకున్నామని చెప్పారు. అక్టోబర్ 1 నుంచి గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మన టీవీ ద్వారా రోజుకు 4 గంటలు చొప్పున శిక్షణా కార్యక్రమాలను ప్రసారం చేస్తామన్నారు.



భవిష్యత్తులో సివిల్స్, ఎం సెట్‌తో పాటు వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఉపయోగపడేలా శిక్షణా కార్యక్రమాలుంటాయన్నారు. ఇస్రో సహకారంతో గుజరాత్ ప్రభుత్వం 16 చానళ్ల ద్వారా వివిధ కార్యక్రమాలను ప్రసారం చేస్తోందని, అదే తరహాలో రాష్ట్రంలోనూ చానళ్ల సంఖ్య పెంచుతామని ప్రకటిం చారు. రైతులకు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం, భూగ ర్భ జలాల గుర్తింపు, వినియోగం వంటి అంశాలపైనా కార్యక్రమాలు రూపొందించి మన టీవీ ద్వారా ప్రసారం చేస్తామన్నారు. భవిష్యత్తులో మున్సిపల్ విభాగంలోనూ ఇస్రో సాంకేతిక సహకారం తీసుకుంటామన్నారు. ఎంఎస్‌వోలు, కేబుల్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించి మన టీవీ ప్రసారాలు అందరికీ చేరేలా చూస్తామన్నారు.



 ఏడాదిలో ఐదు వేల ఉద్యోగాల భర్తీ

 టీఎస్‌పీఎస్సీ ఆవిర్భావం తర్వాత ఏడాది వ్యవధిలోనే 23 నియామక నోటిఫికేషన్ల ద్వారా సుమారు 5 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వెల్లడించారు. పోటీ పరీక్షల శిక్షణ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు భారంగా మారిందని, ఈ విద్యార్థులే ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూస్తున్నారన్నారు. మన టీవీ ద్వారా గ్రామీణ విద్యార్థులకు అవగాహన, శిక్షణ లభిస్తుందన్నారు. పోటీ పరీక్షల సమాచారాన్ని యూట్యూబ్ ద్వారా అందించాలని సూచించారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ఇస్రో ప్రతినిధి వీరేందర్ సింగ్ ఒప్పంద పత్రాలను మార్పిడి చేసుకున్నారు.  కార్యక్రమంలో సాఫ్ట్‌నెట్ సీఈవో శైలేశ్‌రెడ్డి, మృత్యుంజయరెడ్డి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top