చెక్కులు.. చిక్కులు | Difficulties of pregnent ladies | Sakshi
Sakshi News home page

చెక్కులు.. చిక్కులు

Jul 28 2015 11:47 PM | Updated on Aug 20 2018 9:16 PM

సర్కారు దవాఖానాలో కాన్పు చేసుకుంటే నగదు ప్రోత్సాహం చేతికందటానికి బాలింతలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కాదు

బాలింతలకు కష్టాలు
జననీ సుర క్షా యోజనకు కొత్త నిబంధనలు
నగదు ప్రోత్సాహకానికి పాట్లు
 
 సర్కారు దవాఖానాలో కాన్పు చేసుకుంటే నగదు ప్రోత్సాహం చేతికందటానికి బాలింతలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కాదు. చెక్కుల జారీలో వైద్యాధికారుల కొత్త నిబంధనలే ఇందుకు కారణం.. నిన్నామొన్నటి వరకు బేరర్ చెక్కులు అందజేసిన అధికారులు తాజాగా అకౌంట్‌పే ఇవ్వడం బాలింతలను ఇబ్బందికి గురిచేస్తోంది. దీంతో బ్యాంకుల్లో ఖాతాలు లేక నగదు ప్రోత్సాహం కోసం వారు ఇబ్బందులకు గురౌతున్నారు.   
 - తాండూరు
 
 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు ప్రోత్సహించేందుకు జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమం (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కింద కేంద్ర ప్రభుత్వం జననీ సురక్షా యోజన (జేఎస్‌వై) అమలు చేస్తోంది. సర్కారు ఆస్పత్రుల్లో కాన్పు చేసుకున్నందుకు గ్రామీణ ప్రాంతాల మహిళలకు రూ.1000, పట్టణ ప్రాంతాల వారికి రూ.700 చెక్కు రూపంలో అందజేస్తారు.

 ఇంతవరకు నేరుగా బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునేలా బేరర్ చెక్కులు ఇచ్చేవారు. తాజాగా అధికారులు ‘అకౌంట్‌పే’వి మాత్రమే ఇస్తున్నారు. దీంతో బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో ఖాతాలు లేకపోవడంతో డబ్బులు పొందడం వారికి కష్టంగా మారింది. జిల్లా ఆస్పత్రిలో నెలకు సుమారు 200 నుంచి 300 వరకు కాన్పులు జరుగుతుంటాయి. వైద్యాధికారుల నిర్ణయాలు తరచూ మారుతుండడం వల్ల బాలింతలకు పురిటి నొప్పుల కన్నా డబ్బుల తీసుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఎక్కువయ్యాయి.

 పథకం నిబంధనలివీ..
 ఆశ కార్యకర్తలు తమ పరిధిలో గర్భవతులను గుర్తించి ఆరోగ్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకువెళ్లాలి. అక్కడ ఏఎన్‌ఎంలు లబ్ధిదారుల పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత గర్భవతులకు మదర్ చైల్డ్ హెల్త్ (ఎంసీహెచ్) కార్డులు ఇస్తారు. ఇదే సమయంలో బ్యాంకు అకౌంట్లు తీయాలని ఏఎన్‌ఎంలు సూచించాలి.  ఈ ప్రక్రియ సజావుగా జరుగుతుందా లేదా అని సంబంధిత ైవె ద్యాధికారి పర్యవేక్షణ చేయాలి. అయితే ఈ ప్రక్రియ సజావుగా జరగడం లేదు.
 
 అకౌంట్ గురించి తెలియదు
 కర్ణాటక రాష్ర్టంలోని సేడం మా ఊరు. భర్త రమేష్‌తో కలిసి గోపన్‌పల్లిలోని పాలీషింగ్ యూనిట్‌లో పని చేస్తున్నాను. ఈ నెలలో తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో కాన్పు చేసుకున్నాను. రూ.1000 చెక్కు ఇచ్చారు. బ్యాంక్‌కు వెళితే అకౌంట్ ఉంటేనే డబ్బులు ఇస్తామంటున్నారు. ఈ విషయం మాకు ముందుగా తెలియదు.
 - భారతి, బాలింత
 
నగదునే అందించాలి
 కాన్పు చేసుకున్న వారికి ప్రభుత్వం నగదును అందించారు. ఒక వేళ.. కాన్పుకు వచ్చిన వారికి ముందుగానే ఈ విషయమై అవగాహన కల్పించాలి. లేదంటే డబ్బు తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు చేసుకుంటే నగదు ప్రోత్సాహం అందించడంలో ఎలాంటి ఇబ్బంది కలిగొంచొద్దు. 
- సావిత్రి, బాలింత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement