
హైదరాబాద్: గడ్చిరోలి హత్యాకాండలో దోషులను కఠినంగా శిక్షించే వరకు ఒత్తిడి తీసుకురావాలని విరసం నేత వరవరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడ్చిరోలి హత్యాకాండను నిరసిస్తూ ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన ధర్నాలు, వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ఈ కాల్పుల్లో మృతి చెందిన వారి సంఖ్య 42కు చేరిందని ఆయన తెలిపారు. మృతుల సంఖ్య 42 ఉంటే కేవలం 8 మందిని మాత్రమే గుర్తించినట్టు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ ఘటనలో ఎదురుకాల్పులు జరిగితే పోలీసుల వైపు ఎలాంటి ప్రాణనష్టం ఎందుకు జరగలేదని ఆయన ప్రశ్నించారు. ఎన్‌కౌంటర్ కేసులన్నింటిలోనూ భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి, చట్టబద్ధంగా న్యాయ విచారణను ఎదుర్కొని, ఆత్మరక్షణ కోసమే ఎదుటి మనిషిని చంపామని న్యాయస్థానంలో రుజువు చేసుకోవాల్సిందేనని అన్నారు.
ఇదే విషయాన్ని 2009లో ఏపీ హైకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తన తీర్పులో పేర్కొందని గుర్తు చేశారు. సమావేశంలో డాక్టర్ సుధాకర్, పీవోడబ్ల్యూ సంధ్య, చిక్కుడు ప్రభాకర్, ఉ.సా, సూరేపల్లి సుజాత, కోట పాల్గొన్నారు.