మావోయిస్టులు అభివృద్ది నిరోధకులు: డీజీపీ

DGP Mahender Reddy Review Meeting With State IAS Officers Over Maoists - Sakshi

సాక్షి, ఏటూరు నాగారం: మావోయిస్టులు అభివృద్ది నిరోధకులని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఏటూరు నాగారం సబ్ డివిజన్‌లోని వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో ములుగు, భూపాలపల్లికి చెందిన పోలీసు అధికారులతో శనివారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో  అడిషనల్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఐపీఎస్, ఐజీ నాగిరెడ్డి ఐపీఎస్, ఐజీ ప్రభాకర్ రావు ఐపీఎస్, ఐజీ నవీన్ చంద్ ఐపీఎస్, ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్, ఓఎస్‌డీకే సురేష్ కుమార్, శోభన్ కుమార్, ఏఎస్పీ శరత్‌ చంద్ర పవర్ ఐపీఎస్, సాయి చైతన్య ఐపీఎస్, గౌస్ ఆలం ఐపీఎస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మావోయిస్టులు మళ్లీ తెలంగాణలో ప్రవేశించి హింసాత్మక చర్యలకు పూనుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ తరుణంలో తెలంగాణ పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టు ఆగడాలను తెలంగాణ గడ్డ మీద జరగనివ్వబోదని రాష్ట్ర ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు అయినటువంటి హరి భూషణ్, దామోదర్ విలాసవంతమైన జీవితాలను గడుపుతూ అమాయక గిరిజనులను బలిపశువులుగా చేస్తున్నారన్నారన్నారు. మావోయిస్టులకు ఎవరూ కూడా సహకరించకుండా ఉండాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలోని డాక్టర్లలను, ఇంజనీర్లను, వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేసుకునేందుకు పథక రచనతో మావోయస్టులు తిరిగి మళ్లీ తెలంగాణలో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. 

వారు చేసే ప్రయత్నాలను తెలంగాణ పోలీస్ శాఖ సమర్థంగా తిప్పి కొడుతుందని పేర్కొన్నారు. దాదాపు పది సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజల కోపాగ్నికి గురై ఇక్కడి నుంచి ప్రాణభయంతో పారిపోయిన మావోయిస్టులు తిరిగి మళ్ళీ తెలంగాణ ప్రజల కోపానికి గురి కాకూడదని హెచ్చరించారు. తెలంగాణలో ప్రతి గ్రామం రహదారులతో అనుసంధానింపబడి విద్య, వైద్యం వంటి సదుపాయాలను పొందుతూ తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్న ఈ సమయంలో మావోయిస్టులు తిరిగి తెలంగాణలో అశాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇన్ఫార్మర్ల నెపంతో హత్యలకు పాల్పడే మావోయిస్టులకు రానున్న రోజుల్లో తెలంగాణ పోలీస్ శాఖ గట్టి దెబ్బ కొడుతుందని హెచ్చరించారు. నక్సలిజం లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే శరవేగంగా అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దూసుకుపోతుందని తెలియజేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top