ఎంపీపీ ఎంపికలో ఉద్రిక్తత | Defected Congress MPTCs face slipper attack in Narsampet | Sakshi
Sakshi News home page

ఎంపీపీ ఎంపికలో ఉద్రిక్తత

Published Sat, Jun 8 2019 3:36 AM | Last Updated on Sat, Jun 8 2019 3:36 AM

Defected Congress MPTCs face slipper attack in Narsampet - Sakshi

నర్సంపేట: వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గం పరిధిలో ఎంపీపీ ఎంపికలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నర్సంపేట మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు 6 కాంగ్రెస్, 5 టీఆర్‌ఎస్‌ గెలుపొందింది. నర్సంపేట ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకుంది. ఎంపీటీసీల ఫలితాలు వెలువడిన వెంటనే టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ క్యాంపులు ఏర్పాటు చేసుకోగా.. 6వ తేదీ రాత్రి ఇరు పార్టీల ఎంపీటీసీలు నర్సంపేటకు చేరుకున్నారు. అదే రాత్రి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన భాంజీపేట ఎంపీటీసీ అజ్మీరా మౌనిక, రాజుపేట ఎంపీటీసీ బాదావత్‌ వీరన్నలను టీఆర్‌ఎస్‌ శిబిరంలోకి తీసుకున్నారు.

విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్‌ నాయకులు ఉన్న నలుగురు ఎంపీటీసీలతో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. లక్నెపల్లికి చెందిన ఎంపీటీసీ వల్లెరావు రజితను కిడ్నాప్‌ చేశా రని ఆమె భర్త బుచ్చయ్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎంపీటీసీ భర్త ఫిర్యాదు మేరకే లక్నెపల్లి రజితను స్టేషన్‌కు తీసుకువచ్చామని, ఆమెను భర్తకు అప్పగిస్తున్నామని పోలీసులు తెలిపారు. స్టేషన్‌ నుంచి రజితను బుచ్చయ్య తీసుకెళ్తుండగా కాంగ్రెస్‌ నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ మహిళా నేత చెప్పుతో టీఆర్‌ఎస్‌ నాయకులపై దాడికి దిగడంతో ఘర్షణ నెలకొంది. అనంతరం ఎంపీపీగా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మహేశ్వరం ఎంపీటీసీ మోతె కలమ్మ ఎంపిక కాగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన భాంజీపేట ఎంపీటీసీ అజ్మీరా మౌనికకు వైస్‌ ఎంపీపీగా అవకాశం దక్కింది.

నిరసన ‘మంటలు’
పీసీసీ పిలుపులో భాగంగా శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు సిద్ధమయ్యారు. అయితే అనుమతి లేదని ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కొందరు కార్యకర్తలు దిష్టిబొమ్మపై పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇందులో కొందరు కార్యకర్తలు, పోలీసులు చిక్కుకున్నారు. వారికి మంటలు అంటుకోవడంతో ఎవరికి వారు పరుగులు తీశారు. చెల్లాచెదురుగా పడిపోయారు. త్రుటిలో ప్రమాదం తప్పింది.      
సాక్షి ఫొటో జర్నలిస్టు, ఖమ్మం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement