సీఎం కేసీఆర్‌కు డీఎస్‌ బహిరంగ లేఖ | D Srinivas Open Letter To CM KCR | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌కు డీఎస్‌ బహిరంగ లేఖ

Nov 8 2019 10:06 PM | Updated on Nov 8 2019 10:19 PM

D Srinivas Open Letter To CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ పోరాటం తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తోందని రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్‌ అన్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుక్రవారం డీఎస్‌ బహిరంగ లేఖ రాశారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు. ‘కార్మికుల పోరాట పటిమ చూస్తోంటే లక్ష్య సాధనలో శ్రుతి మించకు.. ఎవరికి తల వంచకు’ అనే స్పూర్తి గోచరిస్తోందని లేఖలో తెలిపారు. ఆర్టీసీ కుటుంబాలు అండగా ఉండటం తెలంగాణ మట్టిలోనే ధైర్యం పరిమళిస్తుందని గుర్తుకు వచ్చిందన్నారు. ఒక్క శాతం కార్మికులు కూడా తలవంచక నిలబడటంలో శౌర్యం కనిపిస్తుందన్నారు.

‘ప్రభుత్వంలోని ఏ సంస్థను అయినా ఎలా నడపాలి అనే విషయంలో ముఖ్యమంత్రిగా మీకు విశేష విచక్షణాధికారులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ విభజన ఆస్తుల పంపకం జరగక ముందే టీఎస్ ఆర్టీసీ పూర్తి చట్టబద్ధత కాకముందే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడం సరి కాదు.  సాధ్యం కూడా కాదన్న విషయం మీకు తెలియంది కాదు. హైకోర్టు  చెప్పినట్టు ఉన్నత స్థాయిలో అధికారులు మీకు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లనే అనుచితమైన సలహాలతో మిమ్మల్ని తప్పుదారి పట్టించడం వల్లే ఈ అస్తవ్యస్త అసందిగ్ధ  ఆందోళనకర వాతావరణం ఏర్పడిందని’  లేఖలో పేర్కొన్నారు

తెలంగాణ కోసం ఉద్యమించిన ఆర్టీసీ పోరు బిడ్డల పట్ల మీ స్వభావానికి విరుద్దంగా ఇంత కఠినంగా మీరు వ్యవహరించడం చూస్తుంటే ఎవరిదో కుట్ర ఉన్నట్టు అనుమానం వస్తోందన్నారు. తెలంగాణ బిడ్డలు ఎవరికీ తలవంచరూ అనే విషయం మీకు తెలియంది కాదని.. ఆర్టీసీ కార్మికులనే కాకుండా వారి కుటుంబాలను కూడా మీ ద్వారానే బెదిరించే దుస్సాహసానికి పాల్పడ్డ కుట్ర దారులు ఎవరో అర్థం కావడం లేదన్నారు. 

‘కార్మికుల బలవన్మరణాలకు బాధ్యులలైన వారి మీద గుండె రగులుతోంది. కార్మికులతో పాటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు  ఇంకా పంతాలు పట్టింపులకు పోకుండా వెంటనే కార్మికులందరికి ఉద్యోగ భద్రత కల్పించడం ద్వారా వారిలో విశ్వసనీయతను కల్పించాలి. సానుకూల వాతావరణంలో చర్చలు జరిపి వారి న్యాయమైన కోరికలను అంగీకరించాలి. వెంటనే ఆర్టీసీ వివాదానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేస్తున్నాను అప్పుడే తెలంగాణ ప్రజలు మీ నిర్ణయాన్ని హర్షిస్తారు’ అని లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement