కరోనాను కట్టడి చేస్తాం

CS Somesh Kumar Said We Will Curb Spread Of Corona Virus - Sakshi

ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌  

సూర్యాపేట, గద్వాల, వికారాబాద్‌లో పర్యటన  

సీఎస్‌తోపాటు పాల్గొన్న డీజీపీ, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  

జిల్లాల అధికారులతో వైరస్‌ కట్టడిపై సమీక్ష

సాక్షి, సూర్యాపేట‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేస్తామని, ఇకపై కేసులు పెరగకుండా కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్నారు. సూర్యాపేట, గద్వాల, వికారాబాద్‌ జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు బుధవారం ఆయన ఆయా జిల్లాల్లో పర్యటించా రు. డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. సీఎస్‌ వెంట ఈ పర్యటనలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కారణమైన సూర్యాపేట పట్టణంలోని మార్కెట్‌ బజార్‌ను వారు సందర్శించారు. తర్వాత కలెక్టరేట్‌లో కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ ఆర్‌.భాస్కరన్, జిల్లా అధికారులతో పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం సోమేశ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్‌ కట్టడికోసం కలెక్టర్, ఎస్పీ, జిల్లా వైద్యాధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చినట్టు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 83 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు.

సూర్యాపేట జిల్లాలో కరోనాను కట్టడి చేయడానికి అదనపు అధికారులను నియమించినట్లు చెప్పారు. జిల్లాకు ప్రత్యేక అధికారిగా ఐఏఎస్‌ అధికారిని, అలాగే మున్సిపాలిటీకి సంబంధించి సీనియర్‌ అధికారికి బాధ్యతలు అప్పగించామన్నారు. ఇక్కడ ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌ఓ ఉండడంతో పూర్తిస్థాయి డీఎంహెచ్‌ఓను నియమించినట్టు తెలిపారు. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో ప్రజలెవరూ బయటకు రాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగానికి మరింత ధైర్యం చెప్పేందుకు వచ్చామన్నారు.  

టీం వర్క్‌తో కట్టడి చేయండి..  
టీం వర్క్‌తో కరోనాను కట్టడి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గద్వాల జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వైరస్‌ ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, 12 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూసిన మోమిన్‌మహల్లా ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానిక వైద్యాధికారులతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కరోనా నియంత్రణ ప్రత్యేక అధికారి రోనాల్డ్‌రాస్, కలెక్టర్‌ శృతిఓఝా, ఇన్‌చార్జ్‌ ఎస్పీ అపూర్వరావు, వైద్యశాఖ, హాట్‌స్పాట్‌ కేంద్రాల ప్రత్యేక అధికారులతో సమీక్షించారు.

ప్రజల్లో అవగాహన పెంచి చికిత్స చేసుకునేందుకు స్వతహాగా ముందుకు వచ్చేలా చూడాలన్నారు. కాగా, జిల్లాలో పాజి టివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం పై సీఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కాగా, వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో సోమేశ్‌కుమార్‌ బృందం.. జిల్లా ప్రత్యేక అధికారి రజత్‌కుమార్‌ సైనీ, కలెక్టర్‌ పౌసమి బసు, ఎస్పీ నారాయణ, వైద్యాధికారులతో గంటపాటు సమీక్షించింది. లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని సీఎస్‌ ఆదేశించారు. ఇప్పటివరకు జిల్లాలో 38 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ పౌసమి వివరించారు.  చదవండి: నిర్మాణ రంగ కార్మికులకు...ఆర్థిక భరోసా..!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top