దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం | Cross-country prepare to strike | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం

Aug 3 2015 4:28 AM | Updated on Mar 18 2019 7:55 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా

సెప్టెంబర్ 2న  అర్ధరాత్రి నుంచి ప్రారంభం
ఆటో నుంచి విమానం  సర్వీసుల వరకు నిలిపి వేత
జిల్లా వ్యాప్తంగా 2.5 లక్షల మంది కార్మికులు సమ్మెలోకి
కార్మిక సంఘాల నాయకుల వెల్లడి
 
 ఖమ్మం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను చేసేందుకు 10 ట్రేడ్ యూనియన్లు సిద్ధంగా ఉన్నాయని జిల్లాలోని కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, సీఐటీయూ, టీఎన్‌టీయూసీ, బీఎంఎస్ సంఘాల జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనం నెలకు రూ. 15 వేలు ఇవ్వాలని, కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, వ్యవసాయ రంగం కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో కార్మిక చట్టాలు నీరుగారుతున్నాయన్నారు. 44 చట్టాలను కుదించేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. విదేశీ పెట్టుబడి దారులకు వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వాలు ప్రజలు కష్టాలను తీర్చేందుకు శ్రద్ద పెట్టకపోవడం శోచనీయం అన్నారు. 2010లో నిర్వహించిన సార్వత్రిక సమ్మెను మించిన విధంగా ఈ సమ్మె ఉంటుందని అన్నారు. దేశంలోని సంఘటి, అసంఘటిత రంగాలకు చెందిన కార్మికులు, కర్షకులు ఈ సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. ఆటో డ్రైవర్ మొదలుకొని విమానాల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల వరకు ఈ సమ్మెలో ఉంటారన్నారు.

సమ్మెను విజయవంతం చేసేందుకు ఈనెల 6 న ఖమ్మం నగరంలోని టీఎన్‌జీవో భవనంలో నిర్వహించే సభకు కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు హాజరవుతారని చెప్పారు. ఈనెల 10 నుంచి 20 వరకు జిల్లాలోని ప్రతి గ్రామానికి వెళ్లి సభను విజయవంతం చేయాలని ప్రచారం చేస్తామన్నారు. 27న అన్ని సంఘాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 2 అర్ధరాత్రి నుండి 24 గంటల పాటు సమ్మె కొనసాగుతుందన్నారు. దేశంలోని ప్రతిరంగాన్ని స్పందింప చేస్తామన్నారు. ప్రభుత్వాలు దిగి వచ్చి సమస్యలు పరిష్కరించని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

జిల్లా ప్రజలు సమ్మెను విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరారు. జిల్లా లో 2.5 లక్షల మంది కార్మికులు సమ్మెలోకి దిగనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఐఎన్‌టీయసీ నాయకులు కొత్తా సీతారాములు, నున్నా మాధవరావు, ఐఎఫ్‌టీయూ నాయకులు జి. రామయ్య, ఎ రామారావు, ఏఐటీయూసీ నాయకులు సింగు నర్సింగరావు, సీఐటీయూ నాయకులు కళ్యాణం వెంకటేశ్వర్లు, విష్ణు, టీఎన్‌టీయూసీ నాయకులు హన్మంతరెడ్డి, వెంకటనారాయణ, బీఎంఎస్ నాయకులు వెంకటప్పయ్య, ఇఫ్టూ నాయకులు పోటు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement