
సాక్షి, హైదరాబాద్: అమెరికా సామ్రాజ్యవాద కాంక్షతో వ్యవహరిస్తోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. మఖ్దూం భవన్‌లో శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాలుష్య సమస్యపై అన్నిదేశాలు దృష్టిసారించాలని పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణ ఒప్పందంనుంచి అమెరికా తప్పుకోవడాన్ని ప్రపంచమంతా తప్పుబట్టిందని, కాలుష్యం వెదజల్లుతున్న దేశాల్లో అగ్రరాజ్యమే మొదటి స్థానంలో ఉందన్నారు. ఉత్తర కొరియాపై అమెరికా కయ్యానికి కాలుదువ్వుతోందని ఆరోపించారు. అన్నిదేశాల్లోనూ మీడియా సామ్రాజ్యవాదుల చేతిలో ఉందని సురవరం ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు సిద్ధాంతాల్లో ఉండకూడని వంశపారంపర్య రాజకీయాలు కొరియాలో ఉన్నాయని ఆయన అన్నారు.