కామ్రేడ్ల మధ్య కుదరని సయోధ్య  | CPI and CPM to hold hands for Lok Sabha polls | Sakshi
Sakshi News home page

కామ్రేడ్ల మధ్య కుదరని సయోధ్య 

Mar 6 2019 2:47 AM | Updated on Mar 9 2019 3:34 PM

CPI and CPM to hold hands for Lok Sabha polls - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేయాలనుకుంటున్న సీపీఐ, సీపీఎంల మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన రాజకీయ విధానం విషయంలో ఇరు పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం రాత్రి ఎంబీ భవన్‌లో జరిగిన ఈ రెండు పార్టీల సమన్వయ కమిటీ రెండో సమావేశం కూడా అసంపూర్తిగానే ముగిసింది. సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం, జి.నాగయ్య, చెరుపల్లి సీతారాములు, డీజీ నరసింహారావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీలను ఓడించాలని పిలుపునిద్దామని సీపీఐ నేతలు చేసిన సూచన పట్ల సీపీఎం సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది.

బీజేపీని ఓడించాలని పిలుపునిస్తే సరిపోతుందని, ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి టీఆర్‌ఎస్‌ విషయంలో అలాంటి పిలుపునివ్వడం సరికాదని సీపీఎం నేతలు చెప్పినట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో టీడీపీని కూడా కలుపుకుని వెళ్తే బావుంటుందని సీపీఐ చేసిన మరో సూచనకూ సీపీఎం మద్దతు తెలపలేదని తెలిసింది. టీడీపీ బదులు జనసేనను కలుపుకుంటే అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఆ పార్టీతో కలిసి పోటీచేయొచ్చని సీపీఎం నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. టీడీపీ వద్దనుకున్నపుడు జనసేన మాత్రం ఎందుకని సీపీఐ నాయకులు ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ ఎన్నికల్లో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌( బీఎల్‌ఎఫ్‌) ప్రయోగం వద్దని, సీపీఎం అదే వైఖరితో ఉంటే మాత్రం తాము దూరంగా ఉండాల్సి వస్తుందని సీపీఐ నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం. సీపీఐతో పొత్తుకు తమ కేంద్ర కమిటీ అంగీకారం తెలిపిందని, అయితే టీడీపీతో పొత్తుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నందున జనసేనతో కలిసి వెళ్లాలని రాష్ట్ర పార్టీకి సూచించినట్టు సీపీఎం నేతలు వెల్లడించినట్టు తెలుస్తోంది.
 
కొన్ని సీట్లకే పోటీ... 
రాష్ట్రంలోని మొత్తం 17 సీట్లకు పోటీ చేయాలనే సీపీఎం ఆలోచన పట్ల సీపీఐ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. సీపీఐ, సీపీఎం, టీజేఎస్, ఎంసీపీఐ, ఎంబీటీ, బీఎల్‌పీ పరిమితంగా కొన్ని సీట్లలో పోటీచేసి మిగతా స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతునివ్వాలని సీపీఐ ప్రతిపాదించినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదన పట్ల కూడా సీపీఎం నుంచి సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. బుధ, గురువారాల్లో ఢిల్లీలో జరగనున్న తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా సీపీఎంతో పొత్తులపై చర్చల సారాంశాన్ని వివరిస్తామని సీపీఐ నేతలు చెప్పినట్టు సమాచారం. సీపీఐతో జరిగిన రెండో విడత చర్చల గురించి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గానికి తెలియజేశాక, మరోసారి భేటీ కావాలని ఈ రెండు పార్టీలు నిర్ణయించినట్లు తెలిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement