
సాయుధ పోరాటంపై మావోయిస్టు పార్టీలో భిన్నాభిప్రాయాలు
మావోయిస్టులకు డెడ్‌లైన్ విధించిన హోంమంత్రి అమిత్ షా
2026 మార్చి 31 తర్వాత సాయుధ పోరాటం ఉండేనా ?
సీపీఐ (మావోయిస్టు) ఏర్పాటై నేటితో 21 వసంతాలు పూర్తి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీపీఐ (మావోయిస్టు) పార్టీ ఏర్పడి ఆదివారం నాటికి 21 ఏళ్లు పూర్తవుతోంది. ఈ తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టుగా 2026 మార్చి 31 నాటికి మావోయిస్టుల నిర్మూలన జరుగుతుందా లేక విప్లవ పోరాటం ఇంకా కొనసాగుతుందా? అసలు రాబోయే ఆరు నెలల్లో ఏం జరుగుతోందనే ఉత్కంఠ నెలకొంది.
ఏకంగా సైన్యం ఏర్పాటు
ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో చర్చలు విఫలమైన వెంటనే దేశంలో సాయుధ విప్లవ పోరాటం సాగిస్తున్న పార్టీలన్నీ (ముఖ్యంగా పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్)లు ఏకమై 2004 సెపె్టంబర్ 21న భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా ఏర్పడ్డాయి. తెలంగాణకు చెందిన గణపతి తొలి చీఫ్‌గా ఎన్నికయ్యారు. ఈ మార్పుతో విప్లవ పోరాటాలు కొత్త బలం పుంజుకున్నాయి.
2009 నాటికి దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లోని 200 జిల్లాల్లో ప్రభావం చూపించే స్థాయికి చేరుకున్నారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పేరుతో సొంత సైన్యం ఏర్పాటు చేసుకున్నారు. క్రమంగా ఈ ఆర్మీలోనే 12 వేల మంది సభ్యులు వచ్చి చేరారు. వీరికి అవసరమైన ఆయుధాల కోసం పోలీస్ క్యాంపులపై దాడి పెరిగింది. ఛత్తీస్‌గఢ్ – మహారాష్ట్ర – తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న అడవుల్లో జనతన సర్కార్ పేరుతో సమాంతర ప్రభుత్వాలను సైతం ఏర్పాటు చేశారు.
ప్రధానినే కలవరపరిచారు..
పశుపతి టు తిరుపతి పేరుతో రెడ్ కారిడార్ ఏర్పాటు కోసం మావోయిస్టులు ఉద్యమించారు. దీంతో మావోయిస్టులు పురోగమిస్తున్న తీరు చూసి ‘దేశానికి అంతర్గతంగా మావోయిస్టుల నుంచే అతిపెద్ద ప్రమాదం ఉంది’అని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ 2009 అక్టోబర్ 11న వ్యాఖ్యానించారు. ఆ తర్వాత యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌గా గ్రీన్‌హంట్ మొదలైంది.
2015 తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆపరేషన్ సమాధాన్, ప్రహార్, 2024 జనవరిలో కగార్ (ఫైనల్ మిషన్) మొదలైంది. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను సమూలంగా నిర్మూలిస్తామని హోంమంత్రి అమిత్‌షా ఇప్పటికే ప్రకటించారు.
అన్నట్లుగా నే ప్రత్యేక శిక్షణ పొందిన దళాలను రంగంలోకి దించడంతో మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోయింది. దీంతో శాoతి చర్చల ప్రతిపాదనను ఈ ఏడాది ఏప్రిల్‌లో మావోయిస్టులు తెరపైకి తెచ్చారు. ఇందుకు ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో నిర్బంధం కొనసాగుతోంది. ఇటీవల వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఏడుగురు కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయారు. ఇందులో ఆ పార్టీ చీఫ్ నంబాల కేశవరావు కూడా ఉన్నారు.
సీపీఐ (మావోయిస్టు) ఒక దశనే..
పెరిగిన నిర్బంధంతో ఆ పార్టీకి మిగిలిన ముగ్గరు పొలిట్‌బ్యూరో సభ్యుల్లో ఒకరైన మల్లోజుల వేణుగోపాల్ ఆలియాస్ సోను ఏకంగా ఆయుధాలు వదిలేసి లీగల్ పోరాటానికి సిద్ధమంటూ లేఖ జారీ చేశారు. కానీ, సోను లేఖ ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, సాయుధ పోరాటం కొనసాగుతుందని పార్టీ స్పష్టంచేసింది. వెరసి విప్లవ పోరాటం దశదిశ ఏంటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
అయితే, సాయుధ రైతాంగ పోరాటం, నక్సల్బరీ ఉద్యమం, పీపుల్స్‌వార్ పార్టీలు ఎదుర్కొన్న దశనే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ఎదుర్కొంటోందనే వాదనలు వినిపిస్తున్నాయి. చర్చలు జరిపినా, ఆయుధాలెక్కుపెట్టినా విప్లవ పంథా మారదని మేధావులు అంటున్నారు. సమాజంలో పీడకులు, పీడితులు ఉన్నంత వరకు వర్గపోరాటం కొనసాగుతుందని అంటున్నారు. ఇందులో మావోయిస్టుల పోరాటం కేవలం ఒక దశనే అని వారు చెబుతున్నారు.