
శనివారం ఏఐటీయూసీ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో మాట్లాడుతున్న నారాయణ, చిత్రంలో చాడ వెంకట్ రెడ్డి తదితరులు
హిమాయత్‌నగర్: సింగరేణి సంస్థను ప్రైవేటీకరించడం తగదని సీపీఐ, ఏఐటీయూసీ పేర్కొన్నాయి. సింగరేణి కార్మికుల అక్రమ అరెస్టులు, బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ సీపీఐ, ఏఐటీయూసీ నేతలు, కార్యకర్తలు హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ కార్యాలయం వద్ద శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ బొగ్గు గని కార్మిక సంఘం సమ్మెలో పాల్గొంటున్నట్లు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం తర్వాత కేంద్రానికి తొత్తుగా మారి కార్మికులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ బొగ్గు గనులను నల్ల బంగారంగా రాష్ట్ర ప్రజలు అభివర్ణిస్తారని, అలాంటిది కేంద్ర ప్రభుత్వం ఆ సం స్థను ప్రైవేటీకరణ చేయడం తగదన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బోస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఏకైక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిని పోరాటాల ద్వారా కాపాడుకుంటామన్నారు.