నిలకడగా కరోనా బాధితుని ఆరోగ్యం..

COVID 19 Victim Health Is Persistented - Sakshi

గాంధీలో 12 మంది, ఫీవర్‌లో ఒకరు అడ్మిట్‌

45 మంది నుంచి నమూనాల సేకరణ.. రిపోర్టులు నేడు వచ్చే చాన్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న మహేంద్రహిల్స్‌కు చెందిన యువకుడి (24) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. బాధితుడు న్యుమోనియోతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. మరో ఏడుగురు అనుమానితుల మెడికల్‌ రిపోర్టులు మంగళవారం వచ్చాయి. వీరిందరికీ నెగిటివ్‌ అని తేలింది. తాజాగా గాంధీ ఆస్పత్రిలో మరో 45 మంది అనుమానితుల నుంచి నమానాలు సేకరించారు. వీరిలో 12 మందిని ఐసోలేషన్‌ వార్డులో అడ్మిట్‌ చేసి, మిగిలినవారిని హోం ఐసోలేషన్‌కు సిఫార్సు చేశారు. వీరి రిపోర్టులు బుధవారం వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు కోవిడ్‌ అనుమానిత లక్షణాలతో ఓ వ్యక్తి నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రిలో చేరారు. నెదర్లాండ్‌కు చెందిన ఆ వ్యక్తి(45) దుబాయ్‌ మీదుగా హైదరాబాద్‌ కోకాపేటకు వచ్చారు. ఆయనకు జ్వరం రావడంతో చికిత్సం కోసం గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రికి వెళ్లగా.. కోవిడ్‌ అనుమానంతో నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రికి వెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో ఆయన మంగళవారం ఫీవర్‌ ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు ఆయన్ను ఐసోలేషన్‌ వార్డులో అడ్మిట్‌ చేసుకుని, నమూనాలు సేకరించి, వ్యాధినిర్ధారణ పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి పంపించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top