చేయూతనివ్వండి..

Couple Suffering With Illness And Waiting For Help in Jangaon - Sakshi

6 ఏళ్ల క్రితం భార్యకు వెన్నుపూస విరిగి చచ్చుబడిన కాళ్లు

3 నెలలుగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న భర్త

సమస్యను తెరపైకి తెచ్చిన వాట్సప్‌ గ్రూప్‌

ఆపన్నహస్తం కోసం దంపతుల ఎదురుచూపు

చిల్పూరు : జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన తాళ్లపల్లి రమేష్‌గౌడ్‌ –రమాదేవిలకు ఇద్దరు ఆడపిల్లలు. రమేష్‌  కులవృత్తితో పాటు సెంట్రింగ్‌ కూలీ పనిచేస్తుండగా.. భార్య రమాదేవి కూడా కూలీ పనులు చేస్తూ భర్తకు సాయంగా ఉండేంది. ఇద్దరు కుమార్తెల వివాహం జరిపించారు. ఈక్రమంలో 6 ఏళ్ల క్రితం ఇంటిఆవరణలో ఉన్న చింతచెట్టు పై కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో వెన్ను పూస ఎముక విరిగింది. దీంతో రెండు కాళ్లు చచ్చుబడి పోయాయి. సరిగా నిలబడలేని భార్యకు రమేష్‌ సపర్యలు చేస్తూ వచ్చాడు. ఈక్రమంలో 3 నెలల క్రితం రమేష్‌కు గొంతులో నొప్పిగా ఉండడంతో ఆస్పత్రిలో చూపించగా  గొంతు కేన్సర్‌ అని వైద్యులు తేల్చారు.

దీంతో ఆహారం నోటినుంచి తీనే పరిస్థితి లేకపోవడంతో పొట్టభాగంలో పైపు వేసి అందులో నుంచి కేవలం పండ్ల రసాలను అందించే ఏర్పాటు చేశారు. గొంతు ఆపరేషన్‌కు రెండు నెలల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. చేతిలో చిల్లి గవ్వలేకపోవడంతో స్వగ్రామానికి వచ్చేశారు. అనంతరం హన్మకొండలోని ఫాతిమా కేన్సర్‌ ఆస్పత్రికి వెళ్లగా ఆరోగ్య శ్రీ కార్డుపై తాము ఆపరేషన్‌ చేస్తామని అక్కడి వైద్యులు చెప్పినట్లు బాధితులు తెలిపారు. దీంతో దంపతులు ఇద్దరూ ఇలా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఇబ్బంది ఎదుర్కొంటుండడంతో స్థానిక యువకులు   వాట్సప్‌ గ్రూప్‌లో వీరి సమస్యలను వివరిస్తూ సాయం కోరారు. అడ్మిన్లు తాళ్లపల్లి ప్రవీన్, క్రాంతి, మహేందర్, కొత్తపల్లి యాకరాజులు దాతల సాయం కోరుతూ పోస్టు పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, తన గొంతు ఆపరేషన్‌కు ఆరోగ్య శ్రీ కార్డును త్వరగా కిమ్స్‌నుంచి ఫాతిమాకు బదిలీ చేయించాలని ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. దాతలు 83418 11560, 99851 81981 ద్వారా సహకారం అందిచాలని వేడుకుంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top