ఆగని ‘స్పీడ్‌’ దోపిడీ | Corruption in Speed Governers Sales Hyderabad | Sakshi
Sakshi News home page

ఆగని ‘స్పీడ్‌’ దోపిడీ

Jan 15 2020 8:25 AM | Updated on Jan 15 2020 8:25 AM

Corruption in Speed Governers Sales Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: వాహనాల వేగాన్ని నియంత్రించే పరికరాలు స్పీడ్‌ గవర్నర్‌ల అమ్మకాల్లో అడ్డగోలు దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. మొదట్లో మూడు కంపెనీలకు మాత్రమే అనుమతినిచ్చిన రవాణా శాఖ.. ఆ తర్వాత ధరలపై వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో మరికొన్ని  స్పీడ్‌ గవర్నర్స్‌ తయారీ విక్రయ సంస్థలకు అనుమతినిచ్చింది. అయినప్పటికీ ఒక్కో స్పీడ్‌ గవర్నర్‌ డివైజ్‌ ధర రూ.7000కు ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా దళారులు, ఆర్టీఏ ఏజెంట్‌లు వాహనదారుల నుంచి మరో రూ.2000 అదనంగా వసూలు చేస్తున్నారు. నాగ్‌పూర్‌లో ప్రస్తుతం కేవలం రూ.3000కు లభిస్తున్న డివైజ్‌ను  హైదరాబాద్‌లో రూ.7వేలకు విక్రయిస్తున్నట్లు లారీ యాజమాన్య సంఘాలు, క్యాబ్‌ డ్రైవర్లు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో రూ.3500కు ఒక డివైజ్‌ చొప్పున విక్రయించిన సంస్థలే ఇక్కడ అమాంతంగా ధరలను పెంచడం గమనార్హం. స్పీడ్‌ గవర్నర్‌ల ఏర్పాటులో కేవలం 3 సంస్థల గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తూ  మరిన్ని సంస్థలకు రవాణా శాఖ అవకాశం కల్పించడం ఆహ్వానించదగిన పరిణామమే. ప్రస్తుతం 11 కంపెనీలు ఉన్నాయి. త్వరలో మరిన్ని కంపెనీలకు  అనుమతులు లభించే అవకాశం ఉంది. అయినప్పటికీ  ధరలపై నియంత్రణ కొరవడింది. 

ఇలా మొదలు..
రోడ్డు భద్రత దృష్ట్యా హైవేలపై రవాణా వాహనాల వేగాన్ని 80 కిలోమీటర్‌లకు పరిమితం చేయాలనే లక్ష్యంతో కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం స్పీడ్‌గవర్నర్‌లను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. క్యాబ్‌లు, మ్యాక్సీక్యాబ్‌లు, లారీలు, స్కూల్‌ బస్సులు, ప్రైవేట్‌ బస్సులు తదితర (ఆటోలు, అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు మినహా) అన్ని రకాల రవాణా వాహనాలు గ్రేటర్‌ పరిధిలో గంటకు 60 కిలోమీటర్లు, హైవేలపై 80 కిలోమీటర్లు దాటకుండా వేగాన్ని నియంత్రించే పరికరాలను ఏర్పాటు చేసుకోవడాన్ని అధికారులు తప్పనిసరి చేశారు. దీంతో సుమారు 4 లక్షల వాహనాలు ఈ పరికరాలను ఏర్పాటు చేసుకోవడం అనివార్యమైంది. ఇందులో లారీ సంఘాలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి తాత్కాలికంగా ఊరట పొందాయి. క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, స్కూల్‌ బస్సులు, ఇతరత్రా వాహనాలకు ప్రస్తుతం ఈ నిబంధన కొనసాగుతోంది. స్పీడ్‌ గవర్నర్‌ ఉంటేనే  వాహనాలకు ఫిట్‌నెస్‌ లభిస్తోంది. మొదట్లో కేవలం 3 కంపెనీలకు మాత్రం రవాణా అధికారులు అనుమతినిచ్చారు. ఆటోమొబైల్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఆర్‌ఏఐ) వంటి సంస్థలు 33 కంపెనీలను ప్రామాణికమైనవిగా గుర్తించినప్పటికీ  హైదరాబాద్‌లో కేవలం మూడింటికి మాత్రం అవకాశం ఇవ్వడంతో ధరలను అమాంతంగా పెంచేసి గుత్తాధిపత్యానికి తెరలేపాయి. పొరుగు రాష్ట్రాల్లో విక్రయించిన ధరలను రెట్టింపు చేశాయి. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం మరి కొన్నింటికి అవకాశం కల్పించినప్పటికీ కొత్త కంపెనీలు కూడా పాత వాటినే అనుసరిస్తున్నాయి. ధరలను మాత్రం తగ్గించడం లేదు.

దళారుల దందా..
స్పీడ్‌గవర్నర్‌లపై కంపెనీల నిలువు దోపిడీకి దళారులు మరింత ఆజ్యం పోస్తున్నారు. నగరంలోని అన్ని ఆర్టీఏ కేంద్రాల్లో తిష్ట వేసుకొని ఉన్న దళారులు, ఏజెంట్‌లు స్పీడ్‌గవర్నర్‌లను తెప్పించడంతో పాటు, ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తి చేసి ఇచ్చేందుకు మరో రూ.2000 అదనంగా వసూలు చేస్తున్నారని, దీంతో స్పీడ్‌ గవర్నర్‌ల ధరలు  రూ.9000 నుంచి రూ.10,000 వరకు చేరుకుంటున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆర్టీఏ ఫిట్‌నెస్‌ సెంటర్‌లలో ఇందుకోసం దళారులు మోహరించి ఉంటారు. అధికారులతో సత్సంబంధాలను కొనసాగిస్తూ ఫిట్‌నెస్‌ కోసం వచ్చే వాహనదారులను మరింత దోచుకుంటున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, ఫిర్యాదులను పట్టించుకొనే యంత్రాంగం లేకపోవడమే ఇందుకు కారణమని వాహనదారులు  అభిప్రాయపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement