రెండో దశలో కరోనా: దాటితే నియంత్రణ కష్టమే

CoronaVirus Present In Second In India - Sakshi

అన్ని వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం

కోవిడ్‌–19 హైదరాబాద్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీహర్ష యాదవ్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌ : దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి రెండో దశలో ఉంది. వైరస్‌ వ్యాప్తి మూడో దశ (సామాజిక వ్యాప్తి–కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌)లోకి వ్యాపించడానికి దేశానికి కేవలం 30 రోజులు గడువే ఉంది. వైరస్‌ మూడు, నాలుగు దశలు దాటిపోతే వ్యవస్థలన్నీ కుప్పకూలే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న వైద్య సిబ్బంది, ఆస్పత్రులు, పడకలు ఇతర మౌలిక సదుపాయాలు ఏమాత్రం సరిపోవు. చిన్న వైరసే కదా అని నిర్లక్ష్యం చేస్తే జీవితమే కోల్పొవాల్సి వస్తుంది. ముందే మే ల్కొని ఎవరికి వారు స్వీయ నియంత్రణ చర్యలు చేపడితే..వైరస్‌ భారీ నుంచి సులభంగా బయటపడొచ్చని కోవిడ్‌–19 హైదరాబాద్‌ జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ డాక్ట ర్‌ శ్రీహర్ష యాదవ్‌ సూచించారు. ఆయన మాటల్లోనే...

మొదటి దశ : చైనా, ఇటలీ, ఇరాన్, అమెరియా, యునైటెడ్‌ కింగ్‌డమ్, ఇండోనేషియా దేశాలకు వెళ్లి వచ్చిన వారికి మాత్రమే పాజిటివ్‌గా వస్తుంది. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు వెలుగు చూసిన కేసులన్నీ ఈ దశవే. విదేశాలకు వెళ్లి వచ్చేవాళ్లను ఆయా దేశాల్లోనే నియంత్రించడం ద్వారా తొలి దశలోనే వైరస్‌ను కట్టడి చేయవచ్చు. (ట్రంప్‌ గుడ్‌న్యూస్‌.. కరోనాకు విరుగుడు..!)

రెండో దశ : విదేశాలకు వెళ్లి కరోనా బారినపడి, మన దగ్గరుకు వచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యులు, సహోద్యోగులకు వైరస్‌ విస్తరింపజేసే దశ. దేశంలో ప్రస్తుతం ఈ రెండో దశ కొనసాగుతుంది. ఈ దశను లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌గా వ్యవహరిస్తుంటారు. విమానాశ్రయాల్లో విదేశీ ప్రయాణికులు దిగగానే వారిని స్క్రీనింగ్‌ చేయ డం, లక్షణాలు ఉన్నవారిని ఆస్పత్రులకు తరలించి, చికిత్సలు చేయించడం, వ్యాధి లక్షణాలు లేకపోయినా వారిని ఇతరులకు దూరంగా ఉంచడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ విస్తరించకుంట్ట కట్టడి చేయవచ్చు. ప్రస్తుతం మనం రెండో దశలోనే ఉన్నాం.

మూడో దశ : ఇది అత్యంత కీలకమైనది. ప్రమాదకరమైన దశ. రెండో దశలో వైరస్‌ బారిన పడిన వారి నుంచి చుట్టుపక్కల ఉన్న వారికి పెద్దెత్తునవైరస్‌ విస్తరిస్తుంది. చాలా తక్కువ సమయంలోనే వేలాది మందికి విస్తరిస్తుంది. మరణాల సంఖ్య భారీగా ఉంటుంది. నియంత్రణ కష్టమవుతుంది. ఇటలీ, ఇరాన్‌లు ప్రస్తుతం ఇదే దశను ఎదుర్కొంటున్నాయి. (పారాసిట్‌మాల్‌తో అద్భుత ఫలితం)

నాలుగో దశ : వైరస్‌ నియంత్రణ చేయి దాటిపోయే దశ ఇదే. ప్రస్తుతం ఇటలీ, ఇరాన్‌ ఇదే పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ దశను తొలిసారి చూసిన దేశం చైనా. ఈ దశలోనే అక్కడ కేసుల సంఖ్య 80 వేలు దాటిపోయింది. ఆలస్యంగా మేల్కొన్నప్పటికీ..కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చింది. కానీ ఇరాన్, ఇటలీ వంటి దేశాలు మాత్రం ఇప్పటికీ వైరస్‌తో పోరాడుతూనే ఉన్నాయి.

స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష... 
బయటి దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 14 రోజుల్లో జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల తలెత్తితే కరోనా వైరస్‌గా అనుమానిస్తారు. సాధారణంగా వైరస్‌ రెండు నుంచి 14 రోజుల్లో బయటపడుతుంది. తుంపర్లు, ముట్టుకోవడం వల్ల ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు జనసమూహానికి దూరంగా ఉండటం, ముక్కుకు మాస్కులు ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ద్వారా వైరస్‌ భారీ నుంచి కాపాడుకోవచ్చు. స్వీయ నియంత్రణే చాలా ముఖ్యం.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top