కరోనా: ఓ అడుగు ముందుకు..

Corona Treatment Is One Step Ahead  - Sakshi

యుగాలుగా మనిషిని బాధిస్తున్న జలుబుకు మందు లేదు! కొద్ది రోజుల సహవాసం తర్వాత శరీరం శక్తి పుంజుకుంటుంది.. జలుబుకు కారణమైన వైరస్‌..  ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు దగ్గరి చుట్టమే. మరికొన్ని రోజుల్లో కరోనా ప్రభావం సన్నగిల్లినా.. అది తాత్కాలికమే. మహమ్మారి మాదిరిగా కాకున్నా.. అప్పుడప్పుడూ పలకరించే చుట్టంగా మిగులుతుంది.. ఈ సూక్ష్మజీవితో కలసి జీవించడం ఎలాగో తెలుసుకోవడం మేలంటున్నారు నిపుణులు. కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలేంటి? కరోనా అనంతర ప్రపంచం తీరుతెన్నులేమిటో విశ్లేషిస్తే..

కరోనా చికిత్స విషయంలో ప్రస్తుతానికి ఓ అడుగు ముందుకు పడింది. అమెరికా కంపెనీ గిలీడ్‌ అభివృద్ధి చేసిన రెమ్‌డెసివిర్‌ను అత్యవసర పరిస్థితుల్లో కరోనా చికిత్సకు ఉపయోగించేందుకు ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అనుమతి ఇచ్చింది. వైరస్‌ సంతతి పెరగకుండా అడ్డుకోవడంతోపాటు చికిత్సకు పట్టే కాలాన్ని 15 రోజుల నుంచి 11 రోజులకు తగ్గించేందుకు ఈ మందు ఉపయోగపడుతుందని ఇప్పటికే జరిగిన ప్రయోగాలు చెబుతున్నాయి. మరోవైపు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా కంపెనీ స్ట్రైడ్స్‌ ఇప్పటికే ఫావిపిరావిర్‌ అనే మందును ఎగుమతి చేయడం మొదలుపెట్టగా.. హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ.. ఇదే మందు ఉత్పత్తికి రంగం సిద్ధం చేసింది. చదవండి: అడవిబిడ్డలు ఆగమాగం

వైరస్‌ పునరుత్పత్తికి అవసరమైన ఆర్‌ఎన్‌ఏ పాలిమరేస్‌ ఎంజైమ్‌ను నిర్వీర్యం చేసేందుకు ఈ మందు ఉపయోగపడుతుంది. రెమ్‌డెసివిర్, ఫావిపిరావిర్‌ రెండూ కూడా వేరే వ్యాధి కోసం తయారు చేసి, ఇతర కారణాల వల్ల వాణిజ్య స్థాయిలో తయారు చేయకుండా వదిలేసినవి. ఇవి కరోనా చికిత్స కోసం సిద్ధమవుతుంటే.. టీకా తయారీకి ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు, పరిశోధనా సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ కూడా నడుస్తున్నాయి. చైనాలో రెండు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తయి విస్తృత పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి కరోనా వ్యాక్సిన్‌ సిద్ధమవుతుందని అంచనా. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top