అడవి బిడ్డలు ఆగమాగం

Tribes Struggling Lot In A Lockdown In Telangana - Sakshi

చాలా మందికి అందని ప్రభుత్వ నగదు సాయం

దాతలు అందజేస్తున్న నిత్యావసరాలతో నెట్టుకొస్తున్న వైనం

మరో పక్క వేసవిలో తాగునీరు లేక ఇబ్బందులు

కొన్ని చెంచుపెంటల్లో నిలిచిన ‘ఉపాధి’పథకం పనులు 

సాక్షి, నాగర్‌కర్నూల్‌: నల్లమల అటవీ ప్రాంతంలో అరకొర వసతుల మధ్య జీవిస్తున్న చెంచులకు లాక్‌డౌన్‌ వల్ల మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సాయం చాలా మందికి అందలేదు. కొంత మంది చెంచుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అయినా తీసుకోలేని పరిస్థితి. మరికొందరు చెంచులకు అసలు ప్రభుత్వం నగదు సాయం అందజేసినట్లుగా కూడా తెలియకపోవడం గమనార్హం. లాక్‌డౌన్‌ ఉన్నందున వారిని అడవిలో నుంచి బయటికి రానివ్వడం లేదు. ప్రస్తుతం రేషన్‌ బియ్యం మాత్రమే తీసుకున్న చెంచులు, దాతలు అందజేస్తున్న నిత్యావసరాలతోనే జీవనం వెల్లదీస్తున్నారు.

మరో పక్క వేసవి కాలం కావడంతో చెంచుపెంటల్లో వేసిన బోర్లు పూర్తిగా అడుగంటి పోయాయి. గ్రామీణ నీటిసరఫరా పథకం (ఆర్‌డబ్ల్యూఎస్‌) ద్వారా అధికారులు ఇప్పటివరకు ట్యాంకర్‌లతో నీటిని సరఫరా చేసే వారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఆ సదుపాయం కూడా నిలిచిపోయింది. మరో పక్క వాగులు, నీటి చెలిమలు కూడా ఎండిపోయాయి. దీంతో నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలోని నల్లమల అడవుల్లో ఉన్న మల్లాపూర్, ఫర్హాబాద్, పుల్లాయిపల్లి, రాంపూర్, అప్పాపూర్, భౌరాపూర్‌ తదితర పెంటల్లో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో ఉండి చదువుకుంటున్న పిల్లలంతా ఇప్పుడు ఇళ్లకు చేరుకున్నారు. నీటికొరత కారణంగా వ్యక్తిగత పరిశుభ్రత దూరమైంది. బట్టలు ఉతుక్కోవడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి ఉంది.

సరుకులకోసం ఇక్కట్లు.. 
మన్ననూర్‌కు వచ్చి చెంచులు తమకు కావాల్సిన నిత్యావసరాలను తీసుకెళ్లేవారు. కానీ.. ప్రస్తుతం రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచి పోవడంతో చెంచు పెంటల నుంచి బయటికి వెళ్లలేని పరిస్థితి. గిరిజన కార్పొరేషన్‌ ద్వారా కొన్ని సరుకులు మాత్రమే దొరుకుతున్నాయి. ఉపాధిహామీ వల్ల వచ్చిన కూలీతో కొంత జీవనం గడిచేది. ప్రస్తుతం ఉపాధి పనులు కూడా కొన్ని చెంచుపెంటల్లో జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యం మాత్రమే అందాయి. రూ.1,500 నగదు సాయం తమ ఖాతాల్లో జమ అయిందా.. లేదా అనే అవగాహన కూడా వారికి లేదు. చాలా మందికి బ్యాంకు ఖాతాలు కూడా లేవు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్‌డౌన్‌ ఆర్థిక సాయం కూడా చెంచుల దరి చేరలేదు.

నగదు సాయం ఇచ్చినట్లు తెలవదు..
పోయిన నెలలో రేషన్‌ బియ్యం మాత్రమే తీసుకున్నాం. ప్రభుత్వం నగదు సాయం ఇచ్చినట్లు మాకు తెలవదు. మన్ననూర్‌కు కూడా పోనిస్తలేరు. అధికారులు స్పందించి నగదు సాయం అందజేయాలి.  
– మహేశ్వరి, చెంచుమహిళ, భౌరాపూర్‌

ఇబ్బందులు లేకుండా చర్యలు..
లాక్‌డౌన్‌ వేళ చెంచులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. రేషన్‌బియ్యం, నిత్యావసరాలు అందజేస్తున్నాం. తాగునీటికి సం బంధించి 17 హామ్లెట్లకు బోర్‌లు మంజూరయ్యా యి. త్వరలో బోర్లు వేయిస్తాం. కొంతమందికి రేషన్‌కార్డులు లేవని గుర్తించాం. అలాంటి వారికి కూడా రేషన్‌ అందించేందుకు చర్యలు తీసుకుంటాం. ఉపాధి హామీ పనులు అన్ని పెంటల్లో జరుగుతున్నాయి. ఒకవేళ ఏ పెంటల్లోనైనా జరగకపోతే వెంటనే పని కల్పించాలని ఆదేశిస్తాం. –అఖిలేశ్‌రెడ్డి, ఐటీడీఏ పీఓ, మన్ననూర్, నాగర్‌కర్నూల్‌ జిల్లా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top