1,12,600 మంది చిరుద్యోగులపై వేటు? | Contract employees may lose their jobs on bifurcation process | Sakshi
Sakshi News home page

1,12,600 మంది చిరుద్యోగులపై వేటు?

Mar 18 2014 2:31 AM | Updated on Sep 27 2018 5:59 PM

1,12,600 మంది చిరుద్యోగులపై వేటు? - Sakshi

1,12,600 మంది చిరుద్యోగులపై వేటు?

రాష్ట్ర విభజన నేపథ్యంలో లక్ష మందికి పైగా చిరుద్యోగుల కుటుంబాల జీవనోపాధి మీద దెబ్బపడుతోంది. రాష్ట్ర విభజన చట్టంలో ఎక్కడా ఏ ఉద్యోగినీ తీసేయాలని చెప్పకపోయినా..

‘విభజన’తో వీధిపాలు... మే నెలాఖరుకల్లా ఊస్టింగ్
 వీరి ఉద్యోగాలు పోయినట్టే?!
 కాంట్రాక్టు ఉద్యోగులు     54,598
 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు    36,952
 ఎన్‌ఎంఆర్, ఇతరులు    21,050

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో లక్ష మందికి పైగా చిరుద్యోగుల కుటుంబాల జీవనోపాధి మీద దెబ్బపడుతోంది. రాష్ట్ర విభజన చట్టంలో ఎక్కడా ఏ ఉద్యోగినీ తీసేయాలని చెప్పకపోయినా.. ఆ ముసుగులో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు, సూపర్-న్యూమరరీ, అడ్‌హాక్ పోస్టుల్లోని ఉద్యోగులను వదిలించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్ణయానికి వచ్చింది. రాష్ట్ర విభజనకు సంబంధించి ఉద్యోగుల లెక్కల ప్రకారం ఆయా పోస్టులను తొలగించారు. విభజన లెక్కల్లో ఈ పోస్టులను పరిగణనలోకి తీసుకోవద్దని అన్ని శాఖలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి జారీ చేసిన సర్క్యులర్‌లో స్పష్టంచేశారు.
 
 తొలి నుంచి ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను ఏదోవిధంగా ఇంటికి పంపించాలని చూస్తున్న ఆర్థికశాఖకు ఇప్పుడు రాష్ట్ర విభజన అంశం సాకుగా దొరికింది. దీంతో ఒక్క కలం పోటుతో లక్షకు పైగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల కొలువులను రాష్ట్ర విభజన అమలులోకి వచ్చే తేదీకి రెండు రోజుల ముందుగానే అంటే మే నెలాఖరుకల్లా ఊడబీకాలని ఆర్థికశాఖ నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల కొలువుల కాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. దీంతో లక్ష మందికి పైగా చిరుద్యోగులు వీధినపడాల్సిన పరిస్థితి నెలకొంది.
 
 కొత్త ప్రభుత్వాలు పట్టించుకుంటాయా?
  సాధారణంగా అయితే మరో మూడు నెలలు ఉద్యోగ కాలాన్ని పొడిగిస్తారని అందరూ భావించారు. మూడు నెలలు పొడిగిస్తే జూన్ నెలాఖరు వరకు కొనసాగుతారని.. ఆ తరువాత వచ్చే ప్రభుత్వాలు అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయని అధికార వర్గాలు అభిప్రాయపడ్డాయి. అయితే ఇందుకు పూర్తి విరుద్ధంగా.. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల కొలువుల పొడిగింపు మే నెలాఖరు వరకే ఇవ్వాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్తగా ఏర్పడే రెండు ప్రభుత్వాలకు సవాలక్ష సమస్యలు ఎదురుకానున్నాయి. అలాంటి పరిస్థితుల్లో వెంటనే ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులపై దృష్టి సారించగలవా అనేది ప్రశ్నార్థకం.
 
  ప్రస్తుతం ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులపై ఆధారపడే నడుస్తోంది. బాబు ప్రభుత్వ హయాంలో 4వ తరగతి ఉద్యోగుల భర్తీని నిలుపుదల చేయడంతో అవసరమైన చోటల్లా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకున్నారు. నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తే వారు సరిగా పనిచేయరని, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో తీసుకుంటే ఉద్యోగ అభద్రతాభావంతో పనిచేస్తారనే సిద్ధాంతాన్ని బాబు ప్రభుత్వం అమలు చేసింది.
  ఈ నేపథ్యంలోనే కిందిస్థాయి, మధ్యస్థాయిలో లక్షకుపైగా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు. ప్రభుత్వంలో ఓ పేపర్ టైప్ చేయాలన్నా, ఫైలు ఓ చోట నుంచి మరో చోటకు వెళ్లాలన్నా, కారులో ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లాలన్నా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులే ఇప్పుడు పెద్ద దిక్కుగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగానే ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ వేతనాల్లో మాత్రం చాలా వ్యత్యాసం ఉంది.
 
 రెగ్యులరైజ్ చేయాలి: ఉద్యోగుల సమాఖ్య
 లక్షలాది మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని రాష్ట్ర కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎ.వి.నాగేశ్వరరావు మండిపడ్డారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండా గత రెండేళ్ల నుంచి ప్రభుత్వం మూడేసి నెలలు చొప్పున మాత్రమే పదవీ కాలాన్ని పెంచుతూ వారి జీవితాల్లో అభద్రతను నింపుతోందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, యూనివర్సిటీలు, సొసైటీల్లో కలిపి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మొత్తం 5,47 లక్షల మంది ఉన్నారని ఆయన తెలిపారు. తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement